
గణితం అంటే భయం పోగొట్టి..
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉస్మాన్ పాషాకు పురస్కారం
లింగపాలెం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ధర్మాజిగూడెం హైస్కూల్ ప్లస్ అధ్యాపకుడు ఉస్మాన్ పాషా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకున్న ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. 2008 డీఎస్సీలో ఎంపికై వట్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఆయన 2023 నుంచి పీజీటీ (లెక్కలు) అధ్యాపకునిగా ధర్మాజీగూడెం హైస్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు. వినూత్నమైన టీఎల్‌ఎం ఉపయోగించి ప్లేవే మెథడ్‌లో బోధించి మంచి ఫలితాలు సాధించానన్నారు. ఐసీటీ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి పీపీటీఎస్ యానిమేటెడ్ వీడియోలు తయారు చేయడం, జియోజీబ్రా, రోబో కంపాస్ లాంటి యాప్స్ ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టడంతో దాదాపు పది మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు, ప్రతిభ అవార్డులు సాధించారన్నారు. 2019లో సాంకేతిక శిక్షణ నేస్తం సీబీటీ పోటీ పరీక్షల్లో స్టేట్ రెండవ ర్యాంకు సాధించి ఏపీ ఎస్సీఈఆర్‌టీ టెక్ట్స్ బుక్స్ ఆథర్‌గా సెలెక్ట్ అయ్యి గణిత పుస్తక రచనలో సేవలు అందించినట్లు వివరించారు.