బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు

Sep 7 2025 7:04 AM | Updated on Sep 7 2025 7:04 AM

బీవీ

బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు

బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు వీసీ నియామకానికి ముగ్గురి పేర్లు రేషన్‌ బియ్యం పట్టివేత నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్‌ వ్యాన్‌ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు

భీమవరం : భీమవరంలోని బీవీరాజు కళాశాల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగంలో జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకుందని ప్రిన్సిపాల్‌ ఐఆర్‌ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ ఈ నెల 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ ఘనత సాధించిందని చెప్పారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్‌.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్‌ కేవీ స్వామి అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్‌ అందించారని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందిని విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ కేవీ విష్ణురాజు, వైస్‌ చైర్మన్‌ ఆర్‌.రవిచంద్రన్‌, సెక్రటరీ కె.ఆదిత్య విస్సం, జాయింట్‌ సెక్రటరీ కె.సాయి సుమంత్‌, డైరెక్టర్లు తదితరులు అభినందించారు.

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి వీసీ నియామకం కోసం ముగ్గురు సీనియర్ల పేర్లను రిజిస్ట్రార్‌ ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. ఇన్‌చార్జి వీసీ నియామకానికి అర్హులైన సీనియర్ల పేర్లను వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ టు గవర్నమెంటు తరపున ఈ నెల నాలుగున లేఖ పంపిన నేపథ్యంలో జాబితాను పంపినట్టు సమాచారం. మహానందిలోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్లాంట్‌ పథాలజీ విభాగంలో పనిచేసే డాక్టర్‌ కె.సుబ్రహ్మణ్యం, సీడీహెచ్‌ ఉద్యాన విభాగం పార్వతీపురంలో పనిచేసే అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ బి.ప్రసన్నకుమార్‌, కేవీకే పెరియవరంలో పనిచేసిన డాక్టర్‌ బి.గోవిందరాజులు పేర్లు ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. మరోపక్క 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు యూజీసీ యాక్టును వర్సిటీల ప్రొఫెసర్లకు వర్తింపచేపిన విధంగా తనుక వర్తింప చేయాలని ప్రస్తుత వీసీగా ఉన్న కె.గోపాల్‌ హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై వాదనలను ఈ నెల 11న జరుగనున్నాయి.

తాత్కాలికంగా గోదానం, గో దత్తత నిలుపుదల

ద్వారకాతిరుమల: రాష్ట్రంలో లంపి స్కిన్‌ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నందు వల్ల భక్తుల నుంచి గోదానాన్ని, అలాగే భక్తులకు ఇచ్చే గోదత్తతను శ్రీవారి దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంటు వ్యాధులు తగ్గిన తరువాత మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తామన్నారు.

ఇరగవరం: కె కుముదవల్లిలో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వచేశారనే సమాచారం మేరకు వీఆర్వోతో కలిసి శుక్రవారం రాత్రి దాడులు చేసినట్లు సివిల్‌ సప్లయిస్‌ ఆర్‌ఐ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడుల్లో బందెల సాయి రామ్‌ అనే వ్యక్తి ఇంటి వద్ద 5 క్వింటాల్‌ రేషన్‌ బియ్యంను స్వాధీనం చేసుకుని అతడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఉత్తమ లఘు చిత్రం ‘చివరి శ్వాస’

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లులో శనివారం నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీల్లో ‘చివరి శ్వాస’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ తెలుగు సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రదర్శించిన లఘు చిత్రాలు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. 733, పదిలం.. లఘు చిత్రాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఫిలిం నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ వైజాగ్‌ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరాజు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, కాస్మో కల్చరల్‌ స్పోర్ట్స్‌ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్‌, సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: నకిలీ కరెన్సీ ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐ ఎంవీ సుభాష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ కరెన్సీతో ప్రజలను మోసం చేస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ యు.రవిచంద్ర ఆధ్వర్యంలో ఎస్సై షేక్‌ జబీర్‌, సిబ్బందితో కలిసి స్థానిక బాట గంగానమ్మ ఆలయ సమీపంలో తనిఖీ చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ఏలేటి చంద్రశేఖర్‌ అలియాస్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ కిక్‌ (గోపాలపురం), లాగు శ్రీను (పేరంపేట), మోతరపు వంశీకుమార్‌ (నాగులగూడెం)లను అరెస్టు చేసి విచారించామన్నారు. వీరు నకిలీ రూ.500 నోట్లను నల్ల రంగులో ముద్రించి, ఈ నోట్లు ప్రత్యేక ద్రావణంలో ముంచితే అసలైన నోట్లుగా మారుతాయని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు నగర శివారు జాతీయ రహదారిపై రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలో వ్యాన్‌ బోల్తా పడి 15 మంది కూలీలు గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వీరు చేపల వేటకు వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌ ప్రాంతానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఏలూరు వచ్చే సరికి వాహనం టైర్‌ పంక్చర్‌ కావటంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి బోల్తా కొట్టింది. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్‌ పోలీసులు 108 అంబులెన్స్‌ల్లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. 15 మందిలో నలుగురికి తీవ్ర గాయాలు కావటంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు 1
1/1

బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement