
భవనం పైనుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య
తణుకు అర్బన్: గుర్తుతెలియని వృద్ధుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి తణుకులో జరిగింది. తణుకు సూర్యాలయం వీధిలోని ప్రైవేటు ఆస్పత్రి భవనం పైనుంచి దూకగా.. మృతుడికి 65 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎస్సై ప్రసాద్ సీసీ పుటేజీ పరిశీలించారు. వృద్ధుడు ఆస్పత్రిలోకి వచ్చి మెట్ల మార్గంలో మూడో అంతస్తులోకి వెళ్లి రెయిలింగ్‌పై నుంచి దూకినట్లుగా నిర్ధారించారు. పైనుంచి కిందపడిన వెంటనే తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి చొక్కా జేబులో బిస్కట్ ప్యాకెట్ తప్ప మరే వివరాలు లేకపోవడంతో ఆ వృద్ధుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి ఫొటోతోపాటు వివరాలను పోలీసులు పలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో వివరాలు బయటపడ్డాయి. అత్తిలి మండలం బల్లిపాడులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకర్ల ఆదినారాయణ (65)గా పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ మళ్లీ రాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.