
రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం
● యూరియా కూడా అందించలేని దుస్థితి
● మాజీ మంత్రి కారుమూరి ధ్వజం
తణుకు అర్బన్: రైతులు కష్టాలు, కన్నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు యూరియా అందక అవస్థలు పడుతుంటే, యూరియా కొరతను అధిగమించలేక ఎరువులు, పురుగు మందులు తగ్గించి పండించా లంటూ చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని రైతులకు ఆపాదించేలా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. గత పంట డబ్బులు ఇంకా చేతికి అందక, నేడు పంట చేలన్నీ నీట మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న దాఖలాలే లేవని చెప్పారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు నేడు కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి కేవలం రూ.7 వేలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు క్యూలో ఉండా ల్సి వస్తోందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతుల పట్ల వెటకారంగా మాట్లాడటం బాధాకరమన్నారు. రైతులకు ఇంకా ధాన్యం డబ్బులు రాలేదంటే మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఎమ్మెల్యేలంతా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
కంటిచూపుతో చంపేస్తావా?
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కంటిచూపుతో చంపేస్తానంటూ మర్డరిస్టులా బెదిరిస్తున్న తీరు చూస్తుంటే మంత్రి స్థానంలోనే ఉన్నారా అని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఆయన వ్యవహారశైలి ఇబ్బందికరంగా మారిందన్నారు. తణుకులో ఆవులు, గేదెలను వధిస్తుంటే ఏంచేస్తున్నారని నిలదీశారు. తణుకులో మీరు వెలగబెట్టిన వ్యవహారా లు అందరికీ తెలుసునని, ఆ బాధితులు కూడా బ యటకు వస్తున్నారని చెప్పారు. తణుకులో సొంత పార్టీవారే ఎమ్మెల్యేని నిందించే పరిస్థితి ఏర్పడిందంటే అతని పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. యూరియా కొరతపై ఈనెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించే పార్టీ కార్యక్రమానికి తణుకు నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లనున్నట్టు తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్ నత్తా కృష్ణవేణి పాల్గొన్నారు.