
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
కలెక్టర్ నాగరాణి
భీమవరం: దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముందుగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎనలేనిదన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నతమైన వ్యక్తి అని, అందరికీ ఆదర్శనీయులన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే గురువు పాత్ర అమోఘమైందన్నారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ మాట్లాడారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 56 మంది ఉపాధ్యాయులకు పూలమాల వేసి, శాలువా కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, మత్స్యకార సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, సహాయ సంచాలకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.