
మా గొంతెండుతుంటే నాన్ లేఅవుట్‌కు నీళ్లా?
● మున్సిపాలిటీ నీటి కోసం పంచాయతీ తీర్మానం చేయించిన డిప్యూటీ స్పీకర్
● పట్టించుకోని ఎమ్మెల్యే అంజిబాబు
● జేసీని పక్కదోవ పట్టించిన అధికారులు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ప్రజలు మంచినీటి సమస్యతో సతమతం అవుతుంటే పక్కా నియోజకవర్గంలోని నాన్ లేవుట్‌కు మున్సిపాలిటీ నీళ్ల తరలింపు వివాదాస్పదంగా మారింది. ఉన్నత అధికారులను మున్సిపాలిటీ సిబ్బంది పక్కదోవ పట్టించి తీర్మానం చేయించి నీళ్లను ఉండి నియోజకవర్గంలోని విస్సాకోడేరులోని పవన్ సుధ నాన్ లేవుట్‌కు పైపులైన్ వేసి మరి సరఫరా చేస్తున్నారు. లేవుట్‌లో మొత్తం 50 కుటుంబాలు ఉండగా ఫీజు కట్టిన 32 మంది లబ్ధిదారులకు నీళ్ల సరఫరా జరుగుతోంది.
నాన్ లేవుట్‌కు పైపులైన్ తీర్మానం సూచించిన రఘురామకృష్ణరాజు
పవన్ సుధా నాన్ లేవుట్‌కు విస్సాకోడేరు పంచాయతీ నుంచి మంచినీటి పైపులైన్ వేయడం, నీటి సరఫరాకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని, అది సాధ్యం కాదని పంచాయతీ తీర్మానంలో పేర్కొన్నారు. భీమవరం మున్సిపాలిటీ నుంచి నీళ్లు సరఫరా చేసే పైపులైన్ నుంచి పవన్ సుధా లేవుట్ ఆర్చి వరకు పైపులైన్ వేయాలని ఉండి ఎమ్మెల్యే సూచించనట్లు పంచాయతీ తీర్మానంలో పేర్కొని భీమవరం మున్సిపల్ కమిషనర్‌కు తీర్మానం కాపీ పంపించారు. ఈ తీర్మానంలోనే పంచాయతీ నాన్ లేవుట్ అని రాశారు. అలాంటి నాన్ లేవుట్‌కు ఉండి ఎమ్మెల్యే నీటి సౌకర్యం కల్పించమని ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి అర్డర్
నాన్ లేవుట్‌కు మున్సిపాలిటి నీళ్లు సరఫరా చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. భీమవరం మున్సిపల్ కమిషనర్‌కు ఆర్డర్ జారీ చేయించడంలో ఉండి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.
అనుమతులు లేవు
నాన్ లేవుట్‌కు నీటి సరఫరాకు మున్సిపల్ అధికారులు నిబంధనల ప్రకారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ నుంచి అనుమతులు తీసుకోలేదు. ఇదే విషయంపై పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారి విజయ్‌ను వివరణ కోరగా తమ డిపార్ట్‌మెంట్ నుంచి పవన్ సుధా ఎన్‌క్లేవ్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి సరఫరా చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్, వాటర్ సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు.
జేసీని తప్పుదోవ పట్టించారు
మున్సిపాలిటీ నీటి సరఫరాపై కౌన్సిల్ తీర్మానం పంపించే క్రమంలో మున్సిపాలిటి ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్‌ను మున్సిపల్ అధికారులు
తప్పుదోవ పట్టించారు. తీర్మానంలో ఎక్కడ కూడా నాన్ లేవుట్ అని పేర్కొకుండా లేవుట్ ఆర్చి వరకు పైపులైన్‌ను ఉండి ఎమ్మెల్యే పంచాయతీ తీర్మానంలో సూచించినట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోరు
భీమవరం పట్టణంలో మంచినీటి సమస్య ఉంది. అలాంటిది పక్క నియోజవర్గంలోని ఒక నాన్‌లేవుట్‌కు మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చివరి ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న విషయం ఎమ్మెల్యే అంజిబాబుకు తెలుసు. వేసవిలో రెండు పూటల నీటి సరఫరా కష్టం అవుతుందని తెలిసి కూడా నాన్‌లేవుట్‌కు మున్సిపాలిటీ నీటి సరఫరాకు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
మండిపడుతున్న పట్టణ వాసులు
పక్క నియోజవర్గంలోని నాన్ లేవుట్‌కు సరఫరా చేయడంపై భీమవరం పట్టణ వాసులు మండిపడుతున్నారు. భీమవరంలో పైపులైన్ ఉన్న కొన్ని ప్రాంతాలకు నీళ్లు రావు. చివ రిప్రాంతాలకు నీళ్లు అందవు. అలాంటిది భీమవరం నీళ్లను అక్రమ లేవుట్‌లకు సరఫరా చేయడం దారుణం అంటున్నారు.

మా గొంతెండుతుంటే నాన్ లేఅవుట్‌కు నీళ్లా?