
జలజీవన్ మిషన్‌పై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్–జల జీవన్ మిషన్ అమలు, నిర్వహణపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర సెక్రటరీ రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జల జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులకు సంబంధించి కలెక్టర్ వివరించారు.
భీమవరం: జిల్లా కేంద్రం ఏర్పాటుపై కూటమి పార్టీల నాయకుల వైఖరి ఏంటని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం నాటి కలెక్టరేట్ వ్యవహారం అంశాన్ని అధికార పార్టీల నాయకులు ఎందుకు వివాదం చేస్తున్నారని గోపాలన్ ప్రశ్నించారు. ఒక్కొ పార్టీ నాయకుడు ఒక్కో చోట, ఒక్కో మాట చెప్పి ప్రజలను మభ్య పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ఇంకా అనేక వాగ్దానాలు అమలు చేయా ల్సి ఉండగా వాటి అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని హామీల అమలుకోసం ఆందోళనలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాస్పద అంశాలను సృష్టిస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు.
భీమవరం: పట్టణంలోని చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాల్లో పీఈటీగా పనిచేస్తున్న గొట్టు ముక్కల పూర్ణ చంద్ర శేఖరరాజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 27 ఏళ్లుగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. 2008లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2011లో ఆంధ్రా యూనివర్సిటీ ఉత్తమ పీఈటీ అవార్డును అందించింది.
వేండ్ర పాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డు
వీరవాసరం: వేండ్ర జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు పంపన సాయిబాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1985లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలంటూ కవితలు, గేయాలు రాసి ప్రజలను చైతన్యపర్చారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చాంబర్ నుంచి వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాలను తనిఖీ చేసి ఫోటోలు, తప్పులు ఉన్న పాస్ పుస్తకాలు సవరించి పంపిణీకి సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా రవాణా అధికారిగా కె.ఎస్.ఎం.వి.కృష్ణారావు పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం కలెక్టరేట్ చాంబర్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఏలూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఇంతకుముందు డీటీఓగా పనిచేసిన ఉమామహేశ్వరరావు గత నెల 31న పదవీ వివరణ చేశారు.
భీమవరం: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఎన్.వి.అరుణ్ కుమారి నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా కొండెపిలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు.

జలజీవన్ మిషన్‌పై సమీక్ష