
సర్వీస్ రోడ్ల కోసం రాస్తారోకో
టి.నరసాపురం: టి.నరసాపురం మండల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కేందుకు దిగేందుకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందేనని భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో టి.నరసాపురం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిర్వాసిత రైతుల సమస్యల పరిశీలనకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా టి.నరసాపురం, గురువాయిగూడెం, ఏపుగుంట, మధ్యాహ్నపువారి గూడెం, వెంకటాపురం, బొర్రంపాలెం తదితర గ్రామాల వద్ద భూ నిర్వాసిత రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలు రైతులు చెప్పడంతో నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని చెప్పారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, రైతు పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ, వెదుళ్ళ నాగేశ్వరరావు, లింగారెడ్డి శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బొంతు మురళి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు గ్రావెల్ రోడ్లుగా నిర్మించి ఇస్తామన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వీస్ రోడ్డు మట్టి రోడ్డు కావడంతో దిగుబడిపోయి నానా తంటాలు పడాల్సి వస్తోందన్నారు. సర్వీస్ రోడ్ లో మొక్కలు వేయవద్దని డిమాండ్ చేశారు. టి.నరసాపురం 112వ అండర్ పాస్ వద్ద సర్వీస్ రోడ్ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు.