
అక్రమ లేఅవుట్‌కు మున్సిపల్ పైప్‌లైన్
వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
భీమవరం: భీమవరం పట్టణ ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించకుండా పక్క నియోజకవర్గంలోని అక్రమ లేఅవుట్‌లోని ఇళ్లకు మునిసిపాలిటీ నుంచి మంచినీటి సరఫరా చేయడం వెనుక అవినీతి భాగోతం ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. విస్సాకోడేరు గ్రామంలో అక్రమంగా వేసిన పవన్ సుధ లేఅవుట్‌కు మునిసిపల్ వాటర్ సరఫరా చేయడాన్ని బుధవారం వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. పట్టణంలో మంచినీటి సరఫరా జరగడం లేదని శివారు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతుంటే.. అక్రమ లేఅవుట్‌కు నీటి సరఫరాకు పది అంగుళాల పైప్‌లైన్ వేయడం అన్యాయమన్నారు. విస్సాకోడేరు పంచాయతీ నుంచి మంచినీటి పైప్‌లైన్‌కు దరఖాస్తు చేయగా అక్రమ లేఅవుట్ అంటూ నిరాకరించారని తెలిపారు. అయితే మునిసిపాల్టీ నుంచి ఎవరి ప్రయోజనాలకోసం ప్రత్యేక పైప్‌లైన్ వేశారని దీనికి వెనుక అవినీతి చోటుచేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నాగేశ్వరరావు అన్నారు. విస్సాకోడేరు లేఅవుట్‌కు నీరు ఇవ్వడం వల్ల పట్టణంలోని మారుతీనగర్, కముజువారిపాలెం, బొక్కావారి పాలెం, నెహ్రుకాలనీ తదితర ప్రాంతాలకు మరింత మంటినీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పేరిచర్ల సత్యనారాయణరాజు, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, పాలవెల్లి మంగ, సుంకర బాబూరావు మాట్లాడుతూ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలుండగా మునిసిపాల్టీ నుంచి పైప్‌లైన్ ఇవ్వడానికి సమాధానం ఇవ్వాలన్నారు. మునిసిపల్ అధికారులు ఏ అధికారంతో పైప్‌లైన్ వేశారని నిలదీశారు.విస్సాకోడేరులో లేఅవుట్ ప్రాంతానికి ఇచ్చిన పైప్‌లైన్‌పై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పైప్‌లైన్ వేసిన ప్రాంతాన్ని సందర్శించి ఆందోళన నిర్వహించారు.