
మరోసారి న్యాయం గెలిచింది
● యాసిడ్ దాడి కేసులో ముగ్గురుముద్దాయిలకు కఠిన శిక్షలు
● రెండు జీవిత ఖైదులు, పదేళ్ల కఠిన కారాగారం, జరిమానా
ఏలూరు టౌన్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో మరోసారి ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు రెండు జీవిత ఖైదులతోపాటు మరో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, యాసిడ్ విక్రయించిన వ్యక్తికి జరిమానా విధించగా, మరో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2023లో ప్రత్యేక న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు విధించగా, హైకోర్టును ఆశ్రయించి, తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పును రద్దు చేస్తూ మరోసారి ట్రయల్ నిర్వహించాలని ఆదేశించింది. రెండవ సారి క్షుణ్ణంగా సాక్షాధారాలను, సాక్షులను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు.
అసలేం జరిగిందంటే...
ఏలూరు విద్యానగర్‌లో యడ్ల ఫ్రాన్సినా అనే మహిళ జూన్ 13 తేదీ 2023న రాత్రి 9గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమైపె యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా పోలీస్ అధికారులు కృషితో నిందితులను 48 గంటల్లోపే పట్టుకున్నారు. ఏలూరు కొత్తగూడెంకు చెందిన బోడ నాగసతీష్, అతని స్నేహితులు ఏలూరు వైఎస్సార్ కాలనీకి చెందిన బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. యాసిడ్ కొనుగోలు చేసేందుకు సహకరించిన షేక్ కాజ్‌బాబు, యాసిడ్ విక్రయించిన కొల్లా త్రివిక్రమరావు, అతని వద్ద పనిచేస్తున్న వీడెలా సత్యనారాయణపైనా కేసు నమోదు చేశారు. ఐజీ జీవీజీ అఽశోక్‌కుమార్, అప్పటి జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కేసును పరుగులు పెట్టించి నిందితులకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే కఠిన శిక్ష విధించేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు రెండు జీవిత ఖైదులు విధించగా, ఏ5 నిందితుడికి జరిమానా విధించారు. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా మరోసారి ట్రయల్ నిర్వహించారు.
మరోసారి సంచలన తీర్పు
రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ట్రయల్ నిర్వహించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరోసారి బుధవారం సంచలన తీర్పును వెలువరించారు. ఏ1 నుంచి ఏ3 వరకూ నిందితులైన బోడ నాగసతీష్, బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు రెండు జీవిత ఖైదులతోపాటు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. ఏ5 నిందితుడు కొల్లా త్రివిక్రమరావుకు రూ.1500 జరిమానా, రూ.50 వేలు బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఏ4, ఏ6 నిందితులు షేక్ కాజాబాబు, వీడెలా సత్యనారాయణపై నేరం రుజువు కాలేదని, నిర్ధోషులుగా ప్రకటించారు.
మృతురాలికి న్యాయం చేసే లక్ష్యంతో...
రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ అండర్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పశ్చిమగోదావరి జిల్లా న్యాయమూర్తి మరోసారి ట్రయల్ నిర్వహించారు. సాక్షులను విచారించగా, పూర్తిస్థాయిలో సాక్షాధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ శివకిషోర్ కోర్టు మానిటరింగ్ సెల్‌కు సూచనలు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదమణి తనదైన శైలిలో వాదనలు వినిపించారు. మృతురాలికి న్యాయం చేసే లక్ష్యంతో పనిచేసిన పోలీసులందరినీ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.