
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్ : తణుకు మండలంలోని దువ్వ గ్రామంలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో దుకాణాల్లో ఎరువులకు సంబంధించి రిజిస్టరులో ఉన్న గణాంకాలకు గ్రౌండ్ బ్యాలెన్స్‌లో 17 బస్తాల యూరియా వ్యత్యాసం ఉండటంతో 1.395 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్‌చేసి దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేయాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఏవో జి. మీరయ్య, విజిలెన్స్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్, వ్యవసాయాధికారి కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో యూరియా సరఫరా విషయంలో ఎలాంటి సమస్య లేదని, యూరియా సమృద్ధిగా ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26లో ఇప్పటివరకు 28 వేల టన్నులు సరఫరా చేశామని, రాబోయే 3 నెలల్లో మిగిలిన 3 వేల మెట్రిక్ టన్నులు కూడా త్వరితగతిన అందుబాటులోకి వస్తాయన్నారు.
ద్వారకాతిరుమల: కాణిపాకంలో జరుగుతున్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చినవెంకన్న దేవస్థానం తరపున ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి దంపతులు బుధవారం గణేషుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా శ్రీవారి దేవస్థానం అర్చకులు, పండితులు, ఈఓ దంపతులు కాణిపాకం ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి దేవస్థానం ఈఓ కిషోర్ దంపతులతో కలసి, సత్యన్నారాయణ మూర్తి దంపతులు అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణ నడుమ పూలు, పండ్లు, పట్టువస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని తీసుకెళ్లి వరసిద్ధి వినాయకుడికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు తదితరులున్నారు.

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు