
ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు గేట్ స్కోర్ కీలకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సరం విద్యార్థులకు గేట్–2026 పరీక్షపై బుధవారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రసిద్ధ కోచింగ్ సంస్థ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి చెందిన సీనియర్ ఫ్యాకల్టీ ఎస్ మణిమోహన్ త్రినాథ్ వక్తగా పాల్గొని పలు విషయాలను విద్యార్థులకు వివరించారు. గేట్ పరీక్ష నిర్మాణం, సిలబస్, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యకు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఎంతో కీలకమని అవగాహన కల్పించారు. గేట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆరో తేదీన బ్రాంచి వారీగా మాక్ పరీక్షను నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి, ఈఐటీపీ డీన్ పీ శ్యామ్, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, సెంట్రల్ కోఆర్డినేటర్‌లు ఎం.రామకృష్ణ, వై ప్రియాంక పాల్గొన్నారు.