
మళ్లీ పెరుగుతున్న గోదావరి
కుక్కునూరు: గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం భద్రాచలం వద్ద 8 లక్షల క్యూసెక్కుల వరదతో 42.10 అడుగులకు చేరుకుంది. 43 అడుగులకు వరద ప్రవాహం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడం వలన అటు గోదావరి, ఇటు శబరీ నదులతో విలీన మండలాల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని విలీన మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి వరద తీవ్రత ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పోలవరంలో స్వల్పంగా తగ్గుతూ...
పోలవరం రూరల్: గోదావరి వరద స్వల్పంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగుల నీరు నదిలోకి చేరుతుండటంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 8.62 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువన వరద ఉధృతంగానే ప్రవహిస్తోంది. పట్టిసం శివక్షేత్రం చుట్టూ వరద నీరు తాకుతూ ప్రవహిస్తోంది. భద్రాచం వద్ద 48.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు చేరడంతో ప్రవాహం ఒకే విధంగా కొనసాగుతోంది.