
క్షీరారామంలో శివ సహస్రనామ పూజలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారముల ప్రదక్షిణలు పూర్తిచేసుకున్న భక్తులు మంగళవారం శివ సహస్రనామ పూజల్లో పాల్గొన్నారు. సుమారు 50 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, ఆలయ అభిషేక పండితులు భమిడపాటి వెంకన్న, అర్చకులు వీరబాబు, పూర్ణయ్య, మద్దూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మంగళవారం సాయంత్రానికి కూడా రాలేదు. దీంతో ఈ కుర్చీ విషయంలో సందిగ్ధ స్థితి కొనసాగుతోంది. కొత్త ఉపకులపతి వస్తేనే కాని, లేదంటే ఎవ్వరినైనా ఇన్‌చార్జిగా నియమించి వారు ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించేవరకు ప్రస్తుతమున్న వీసీ కొనసాగుతారు. అయితే విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు ఉండదు. మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం వర్సిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.