
దారి కాచి దాడులా?
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దారి కాచి దాడి చేయడం చూస్తుంటే నియోజకవర్గంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపారని నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రోణంకి శ్రీనివాస్‌పై దాడి విషయంలో నరసాపురం పార్లమెంటు ఇంచార్జ్ గూడూరి ఉమాబాల, యడ్ల తాతాజీతో కలిసి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ శ్రీనివాస్ నరసాపురంలో పని ముగించుకుని రాత్రి ఒంటి గంట సమయంలో వస్తుండగా పాలకొల్లు వచ్చేసరికి 20 మంది దారి కాచి ఏంటిరా సోషల్ మీడియాలో పవన్‌పై పోస్టింగ్‌లు పెడుతున్నావని ప్రశ్నించడంతో పాటు నిన్ను ఏదైనా చేస్తే మీ జగన్ వస్తాడా? అంటూ శ్రీనివాస్‌పై దాడి చేశారన్నారు. మంత్రి ఇలాంటి సంఘటనలకు మద్దతు తెలపడం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. 2022లో జరిగిన సంఘటనపై కేసును రీ ఓపెన్ చేయించి కేసు కట్టించారని, ఈ కేసులో మాత్రం ఎస్సైను అడిగితే రెండు రోజులైంది కదా ఇప్పుడు వస్తే ఎలా అని అడుగుతున్నారన్నారు. సీసీ పుటేజి ఆధారంగా తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు.