
పేట్రేగిన టీడీపీ మూకలు
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నానిపై దాడి
● ఆస్పత్రికి వెళ్తే అక్కడికీ వెళ్లి దాడిచేసిన టీడీపీ మూకలు
టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో దాడులు, దౌర్జ న్యాలు, అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై దాడులు పరంపర కొనసాగుతోంది. గతేడాది జూలై7న నాని ఇల్లు, తండ్రి కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు, ద్విచక్రవాహనాలను దగ్ధం చేశారు.
ఆస్పత్రిలో మరోసారి దాడి
నానిపై మంగళవారం టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. ఈ మేరకు నాని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నాని ప్రయాణిస్తున్న కారుపై కత్తి, క్రికెట్ కర్రతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. మంగళవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీరామవరంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కారులో తిరిగివస్తుండగా శ్రీరామవరం మలుపు దాటిన తర్వాత టీడీపీ నాయకులు మోత్కూరు నాని, అక్కినేని రాజేంద్రప్రసాద్ తన కారుకు వాళ్ళ కారు అడ్డుపెట్టి క్రికెట్ కర్రలు, కత్తితో దాడి చేసి అద్దాలు పగలగొట్టారని చెప్పారు. తనను కారులో నుంచి కిందకు లాగి క్రికెట్ కర్రతో చంక కింద భుజం పైన కొట్టారన్నారు. తనపై టీడీపీ నాయకులు దాడి చేస్తుండగానే వారు ఫోన్ చేస్తే మరో 30 మంది వచ్చారన్నారు. తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఎస్పీకి చెప్పి చూపించడానికి నాని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడ కూడా టీడీపీ శ్రేణులు వచ్చి దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న పార్టీ నాయకులు కే. పట్టాభిరామయ్య, కే. బాలు, సాయిలపై దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభిరామయ్య తలకు గాయమైంది. ఈ దాడులను మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఖండించారు.

పేట్రేగిన టీడీపీ మూకలు