
వైఎస్ చలవతో తమ్మిలేరు కష్టాలకు చెక్
రివిట్‌మెంట్ నిర్మాణానికి చర్యలు
మాజీ సీఎం జగన్ అన్నతోనే..
● రక్షణ గోడ నిర్మాణానికి నాంది పలికిన వైఎస్సార్
● రూ. 60 కోట్ల గోడతో ప్రజలకు ఊరట
ఏలూరు టౌన్: ‘ఏలూరు దుఃఖదాయినిగా తమ్మిలేరును పిలుచుకునే పరిస్థితి.. తుపానులు, భారీ వర్షాలు కురిస్తే చాలు.. ఏలూరు నగరంలో తూర్పు, పడమరగా ప్రవహించే తమ్మిలేరు వరద ఉద్ధృతికి జనం బెంబేలెత్తేవారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యేవి. ప్రజలంతా నిరాశ్రయులై పిల్లాపాపలతో బతికితే చాలు అన్నట్లు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే దుస్థితి ఉండేది.
2005లో ముఖ్యమంత్రిగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు నగరంలో వరద పరిస్థితులను పరిశీలించేందుకు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలోనే వరద బాధితులను పరామర్శించారు. ప్రజలను తీవ్రస్థాయిలో కష్టాల్లోకి నెడుతున్న తమ్మిలేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి ఆయన నాంది పలికారు. తమ్మిలేరు గట్లకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. నిధులు సైతం విడుదల చేశారు. నేడు ప్రజలు భయం లేకుండా సురక్షితంగా ఉన్నారంటే... ‘మహానేత డాక్టర్ వైఎస్సార్ చలవే అంటారు’
తమ్మిలేరు వరదముప్పుకు శాశ్వత పరిష్కారం
తమ్మిలేరు ఏలూరు నగరంలోకి ప్రవేశిస్తూనే తూర్పు, పడమరగా రెండు పాయలుగా ప్రవహిస్తుంది. తూర్పు వైపు అశోక్‌నగర్, కుమ్మరిరేవు, ఇజ్రాయేల్‌పేట, బీడీ కాలనీ, తంగెళ్ళమూడి సెంటర్ మీదుగా వెళుతుంది. పడమరవైపు అశోక్‌నగర్ బ్రిడ్జికి ముందుగా ప్రవహిస్తూ శనివారపుపేట కాజ్‌వే మీదుగా అమీనాటపేట ఏటిగట్టు, జన్మభూమి పార్క్, సీఆర్‌ఆర్ కాలేజీ ప్రాంతంలో నుంచి పడమర లాకుల వైపు వెళుతుంది. అనంతరం ఎన్‌టీఆర్ కాలనీ, కొత్తూరు కాజ్‌వే, పోణంగి, వైఎస్సార్ కాలనీల మీదుగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ గతంలో తమ్మిలేరు వరదముంపు ప్రభావిత ప్రాంతాలే కావటం విశేషం. భారీ ఎత్తున వరదనీరు ఏలూరు నగరంలోకి ప్రవేశిస్తే చాలు ప్రజలు వరద భయంతో వణికిపోయేవారు.
రూ.60 కోట్లతో రక్షణ గోడ
ఏలూరు నగర ప్రజలకు తమ్మిలేరు ఏటిగట్టు వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు 2005లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.60 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏలూరు అశోక్‌నగర్ ప్రాంతంలో తూర్పు, పడమర వైపు ఏటిగట్టుకు రివిట్‌మెంట్ నిర్మాణం చేశారు. మరోవైపు అమీనాపేట ప్రాంతంలో తమ్మిలేరుకు రెండు వైపులా రక్షణ గోడ నిర్మాణం చేశారు. ఈ రివిట్‌మెంట్‌తో వరద ముంపు బారి నుంచి కొంతమేర ఊరట లభించింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో రూ.80 కోట్లతో మరికొన్ని ప్రాంతాల్లో తమ్మిలేరుకు రివిట్‌మెంట్ నిర్మాణం చేశారు. వైఎస్సార్ కాలనీ, పోణంగి ప్రాంతాలకు పూర్తిస్థాయిలో వరద భయం పోయింది.
ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు నియోజకవర్గ ప్రజలు తమ్మిలేరు వరదముంపుతో కష్టాలు పడకూడదనే సంకల్పంతో రివిట్‌మెంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి నిర్మాణం చేసేలా శ్రద్ధ చూపారు. దీంతో అమీనాపేట ఏటిగట్టు, ఇజ్రాయేల్ పేట, అశోక్‌నగర్ ప్రాంతాల్లోని ప్రజలు ప్రశాంతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ తమ్మిలేరుకు రివిట్‌మెంట్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
– పల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మహానేత డాక్టర్ వైఎస్సార్ ఏలూరు నియోజకవర్గం ప్రజల పట్ల అభిమానంతో పనిచేశారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ... ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేశారు. పోణంగి, వైఎస్సార్ కాలనీల్లో ప్రజలు తమ్మిలేరుకు వరద వస్తే చాలు.. కట్టుబట్టలతో పరుగులు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ మహానేత వైఎస్సార్ అనంతరం మాజీ సీఎం జగన్ అన్నతోనే ... మిగిలిన చోట్ల రివిట్‌మెంట్ నిర్మాణం సాధ్యం అవుతుంది.
– గంటా రాజేంద్ర, ఏలూరు వన్‌టౌన్

వైఎస్ చలవతో తమ్మిలేరు కష్టాలకు చెక్

వైఎస్ చలవతో తమ్మిలేరు కష్టాలకు చెక్

వైఎస్ చలవతో తమ్మిలేరు కష్టాలకు చెక్