
రోడ్డెక్కిన గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు
చింతలపూడి: గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రేచర్ల గ్రామం వద్ద ఆందోళన చేపట్టారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక, తమ పంటలు తెచ్చుకునే అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల అండర్ పాస్‌లు తగినంత ఎత్తు, వెడల్పుతో నిర్మాణం చేయకపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే వలన ప్రతి గ్రామం పరిధిలో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాల వారీగా రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. రేచర్ల ఎగ్జిట్ వద్ద రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గం లేదన్నారు. సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులు, కేఎంవీఎల్ రోడ్డు నిర్మాణ సంస్థ మేనేజర్ తదితరులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన రైతులకు, ప్రజలకు వస్తున్న సమస్యలను పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సర్వీస్ రోడ్లు నిర్మించాలని డిమాండ్