
వైద్యం వికటించి.. యువతి మృతి
ఏలూరు టౌన్: ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్వాకంతో వైద్యం వికటించి ఒక యువతి మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆర్‌ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఏలూరు వన్‌టౌన్ తూర్పువీధి మేకల కబేళా ప్రాంతానికి చెందిన కటారి భారతి (20) భర్తతో కలిసి జీవిస్తోంది. గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో ఆమెను మంగళవారం వంగాయగూడెం సెంటర్‌లోని ఆర్‌ఎంపీ వైద్యుడు నాని వద్దకు తీసుకువెళ్లారు. అతని క్లినిక్ పక్కనే ఉన్న మెడికల్ షాపులో రెండు ఇంజక్షన్లు తీసుకుని జ్వరంతో బాధపడుతున్న భారతికి నరంలోకి ఇంజెక్షన్ ఇచ్చారు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని బంధువులకు సూచించాడు. ఇంజక్షన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆమె స్పృహ కోల్పోయింది. బంధువులంతా భయపడగా... ఏమీ కాదనీ కంగారుపడవద్దని ఆర్‌ఎంపీ వైద్యుడు నాని చెప్పాడు. కొంతసేపు గడచిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వేరొక హాస్పిటల్‌కు తరలించాలని సూచించాడు. బంధువులు వేరొక హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగానే ఆమె మృతిచెందింది. కోపంతో బంధువులంతా ఆమె మృతదేహాంతో నాని క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం రావటంతో ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి సర్థిచెప్పారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. ఇదే తరహాలో ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్వాకంతో గతంలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అతనికి వైద్యం చేసే అర్హత కూడా లేదని పలువురు చెబుతున్నారు.
ఆర్‌ఎంపీ క్లినిక్ వద్ద బంధువుల ఆందోళన