
తప్పని పడవ ప్రయాణం
వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా వేలేరుసాడు మండలాన్ని ముంపు వీడటం లేదు. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 41.40 అడుగులకు చేరింది. అయినప్పటికీ మండలంలో అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు ఐదో రోజూ కూడా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి మంగళవారం బయటపడింది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాల్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు. దిగువ గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు.
ఐదో రోజూ జలదిగ్బంధంలోనే 25 గ్రామాలు