
శోకసంద్రంగా తీరం
తూర్పుతాళ్లు ఈవనవారి మెరకలో విషాదఛాయలు
నరసాపురం రూరల్: వినాయక నిమజ్జనంలో జరిగిన అపశ్రుతితో ఆ నాలుగు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. భక్తిశ్రద్ధలతో గణపయ్యను మొక్కే ఆ కుటుంబాల్లో వినాయక చవితి పండుగ చీకటి రోజులను విడిచింది. తూర్పుతాళ్లు గ్రామపరిధిలోని ఈవనవారి మెరక రామలయం వద్ద ఆదివారం జరిగిన నిమజ్జన ఊరేగింపు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన నలుగురూ నాలుగు కుటుంబాలకు చెందిన వారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఆయా కుటుంబాలకు ముఖ్యజీవనాధారం. రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు వారివి. వారిని మృత్యువు కబళించేయడంతో ఆ కుటుంబాల పరిస్థితి అయోమయమైంది.
గుమ్మం ఎదుటే మృత్యువాత
ఈవన సూర్యనారాయణ (58) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తుంటారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో ఇద్దరు పెయింటింగ్ పని చేస్తుంటారు. మూడో కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి వివాహం చేయాల్సి ఉంది. ఘటన జరిగే ముందే వ్యవసాయ పనులు ముగించుకుని స్నానం చేసి దేవుని ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన సూర్యనారాయణ ఇంటి ఎదుటే మృత్యువాత పడ్డాడు.
భారం మోసేవాడే దూరమైతే..
గురుజు మురళి (38)కి వివాహమై మూడేళ్లయింది. భార్య కనకమహాలక్ష్మితో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు, వ్యవసాయ కూలీగా జీవనం సాగించే తమ్ముడు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకునేందుకు ఇటీవలే బట్టల వ్యాపారం కూడా ప్రారంభించాడు. కుటుంబ భారాన్ని మోసే కొడుకు దూరం అవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి.
జీవిత మాధుర్యాన్ని అనుభవించకుండానే..
తిరుమల నరసింహమూర్తి (35) పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అందరితో మంచిగా ఉంటూ ఆనందంగా ఉండే చురుకై న వ్యక్తి. ఇతనికి లేకలేక కలిగిన కవలలైన బాబు, పాపలతో ఇప్పుడిప్పుడే జీవిత మాధుర్యాన్ని చూస్తున్నాడు. ఇంతలోనే అతని మరణం కుటుంబంతో పాటు బంధుమిత్రులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
బాలుడిని కబళించిన మృత్యువు
జై బోలో గణేష్ మహారాజ్‌కీ అంటూ చిందులేసిన తొమ్మిదేళ్ల కడియం దినేష్‌నాయుడు నరసాపురం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. వినాయక నిమజ్జన ఊరేగింపు చూసేందుకు వ్యాన్ డ్రైవర్‌గా జీవనం సాగించే నాన్న, అన్నయ్యలతో పాటే వెళ్లాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ మృత్యురూపంలో దూసుకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు లేడన్న విషయంతో ఆ తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరం కావడంలేదు. సోమవారం నరసాపురం ప్రభుత్వాసుపత్రినుంచి మృతదేహాలకు పంచనామా ముగించుకుని గ్రామానికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకే గ్రామంలో ఒకే ప్రాంతంలో నలుగురు మృతితో తీరప్రాంతం అంతా మూగబోయినట్లయ్యింది.
గురుజు మురళి (ఫైల్)
ఈవన సూర్యనారాయణ (ఫైల్)
తిరుమల
నరశింహమూర్తి (ఫైల్)
కడియం దినేష్ నాయుడు (ఫైల్)

శోకసంద్రంగా తీరం

శోకసంద్రంగా తీరం

శోకసంద్రంగా తీరం