
ఆప్కాస్ ఆపరేటర్ లైంగిక వేధింపులు
లోతైన దర్యాప్తు చేస్తాం
● కమిషనర్‌కు మహిళా ఉద్యోగి ఫిర్యాదు
● విచారణకు ఆదేశం
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆప్కాస్ ఆపరేటర్ బాలా మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో ఓ సెక్షన్‌లో చిరుద్యోగం చేస్తున్న మహిళను తాజాగా వేధించడంతో ఆమె శనివారం మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా బాలా బాధిత మహిళా ఉద్యోగులు సోమ వారం మూకుమ్మడిగా కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.
అధికారుల అండదండలతోనే..!
మహిళా ఉద్యోగులు లక్ష్యంగా బాలా వేధింపులకు పాల్పడటం, ఇందుకు కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. మెసేజ్‌ల ద్వారా వేధించే పర్వం ఓ దశలో సహాయక మహిళా ఉన్నతాధికారిని కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్లిందని సమాచారం. దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న బాలా అధికారులను లోబర్చుకుని వేధింపుల పర్వం కొనసాగిస్తున్నాడు. కోవిడ్ సమయంలో మున్సిపాలిటీ నుంచి ఆస్పత్రి వద్ద విధులకు, ఆ తర్వాత తాళ్లముదునూరుపాడులో హైస్కూల్‌కు బదిలీ అయ్యాడు. అతడి చీకటి వ్యవహారాలకు బాసటగా నిలిచే ఓ మహిళా ఉద్యోగి సహకారంతో తిరిగి మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చినట్టు సమాచారం. సదరు మహిళా ఉద్యోగిని వేరే మున్సిపాలిటీకి బదిలీ కాగా బా లాను కోవర్టుగా వాడుకుంటున్నట్టు తెలిసింది. అలాగే మరికొందరు అధికారుల అండదండలు బా లాకు పుష్కలంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేయడంతో బాలా ఓ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరో ఉద్యోగితో కలిసి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బాలోత్సవం జరిగిన రోజు రాత్రి ఓ మహిళా చిరుద్యోగినికి వేధింపులకు గురిచేసేలా మెసేజ్ పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మున్సిపల్ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న బాలా అనే వ్యక్తి తనను మెసేజ్‌ల ద్వారా వేధిస్తున్నట్టు మహిళా ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేశారు. ఆమెను, బాలాను కార్యా లయ మేనేజర్ సమక్షంలో విచారణ చేశాం. సారీ.. ఆమె నాకు చెల్లి వంటిది, ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవంటూ బాలా వివరణ ఇచ్చారు. ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం.
– ఎం.ఏసుబాబు, మున్సిపల్ కమిషనర్, తాడేపల్లిగూడెం