
వీసీ నియామకంలో పితలాటకం
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొత్త వీసీ నియామకంలో పితలాటకం మొదలైంది. ప్రస్తుత వీసీ డాక్టర్ కె.గోపాల్ ఉద్యోగ కాలం ఆదివారంతో ముగిసింది. వాస్తవానికి తదుపరి వీసీ ఎవరనేది ప్రభుత్వం శుక్రవారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అది జరగలేదు. వీసీ గోపాల్ ఉద్యోగ కాలాన్ని అయినా పొడిగించాలి లేదా ఇన్‌చార్జి వీసీని నియమించాలి. అయితే ఇవి కూడా జరగలేదు. దీంతో తననే వీసీగా కొనసాగించాలని ప్రస్తుత వైస్ చానల్సర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఈనెల 26కి వా యిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
వీసీ వాదనేంటంటే..
వీసీగా వచ్చే వ్యక్తిని ఉన్నత విద్యాశాఖకు చెందిన వ్యక్తిగా పరిగణించాలని, వారికి మాదిరిగానే వయ సును 62 నుంచి 65 ఏళ్లకు పరిగణనలోకి తీసుకుని తనకు 65 ఏళ్లు వచ్చే వరకు కొనసాగించాలని వీసీ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. గోపాల్ 1987లో అసిస్టెంట్ రీసెర్చ్ అధికారిగా అప్పటి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరారు. అనంతరం ప్లాంట్ పథాలజీ ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2007లో ఉద్యాన వర్సిటీలో ప్రవేశించి వీసీ స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలంలో ఆగస్టు 31తో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ జీఓ 39 ప్రకారం విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లుగా పెంచినట్టుగా సూపర్ రెన్యూయేషన్ పద్ధతిన ప్రొఫెసర్‌గా ఉన్న తనకూ ఈ జీఓ వర్తింపజేయాలని కోరారు. వాస్తవానికి జీఓ 39 ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాశాఖలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కింద పనిచేసే అధ్యాపకులకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్లకు వర్తించదు. ఉద్యాన వర్సిటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తారు. వీరికి వేతనాలను ప్రభుత్వమే ఇస్తుంది. యూజీసీ వేతనాల పరిఽధిలోకి రారు కాబట్టి ఈ రిట్‌పై దఖలు చేసిన వ్యక్తి కౌంటర్ అఫిడవిట్‌ను ఈనెల 29న దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో వీసీ గోపాల్‌కు ఊరట దొరకలేదు. మొత్తంగా ఉద్యాన వర్సిటీ వీసీ నియా మకంలో డైలమా కొనసాగుతోంది.
ఆగస్టు 31తో ముగిసిన ఉద్యాన వర్సిటీ వీసీ పదవీ కాలం
కొత్త వీసీని నియమించని ప్రభుత్వం
తననే కొనసాగించాలని కోర్టును ఆశ్రయించిన ప్రస్తుత వీసీ గోపాల్