
కలెక్టరేట్ తరలిస్తే ఉద్యమమే
● అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల హెచ్చరిక
● ముఖం చాటేసిన టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు
భీమవరం: భీమవరంలో కలెక్టరేట్‌ను వేరొక చోటుకు తరలిస్తే సహించేదిలేదని అందరికీ అనుకూలంగా వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతంలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాలు నిర్మించాలని పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో కలెక్టరేట్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్న ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిని ఎండగట్టారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయడమేగాక అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతంలోని 20 ఎకరాల భూమి కేటాయించి రూ.100 కోట్లు నిధులు కేటాయించారన్నారు. భవనాల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచిన తరుణంలో ప్రభుత్వం మారడంతో కొత్త ప్రతిపాదనలు తెరపైకి తేవడం ప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు. ప్రజలను అయోమయానికి గురిచేయకుండా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశానికి టీడీపీ, బీజేపీ, సీపీఎం నాయకులు ముఖం చాటేయగా వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.