
రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు
భీమవరం: స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సంచార జాతులకు రిజర్వేషన్ ఫలాలు ఒక్క శాతం కూడా అందడం లేదని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అన్నారు, భీమవరంలో శనివారం భారతదేశ విముక్తి సంచారజాతుల 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోషేను రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో సంచార జాతులను గుర్తించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయ గుర్తింపుతో పాటుగా అనేక సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంచార జాతులను గుర్తించకపోవడం దారుణమన్నారు. పెండ్ర వీరన్న మాట్లాడుతూ బ్రిటిష్ వ్యవస్థలో సంచార జాతులకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల్లో సంచార జాతులను సంఘటితం చేసి ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నరసాపురం వైస్సార్‌సీపీ పార్లమెంటు ఇన్‌చార్జ్ గూడూరు ఉమాబాల, భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి, దళిత సంఘాల జేఏసీ నాయకులు కోన జోసెఫ్, సంఘ గౌరవ సలహాదారు గంటా వెంకన్న పాల్గొన్నారు.