
రాష్ట్రంలో అసురుల పాలన
యలమంచిలి: రాష్ట్రంలో అసురుల పాలన నడుస్తోందని, వారి పాలనలో మంచి వాళ్లకు కష్టాలు తప్పవని నరసాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. స్థానిక తమ్మినీడి ఉమా నరసింహ కల్యాణ మండపంలో బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో మోసపూరిత హామీలకు పేటెంట్ ఉన్న ఏకై క నాయకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఏనాడు ఒంటరిగా పోటీచేసి గెలిచింది లేదన్నారు. పాలకొల్లులో గత మూడు పర్యాయాలుగా ఓడిపోతున్నా మొక్కవోని విశ్వాసంతో పని చేస్తున్న కార్యకర్తలంతా వజ్రాలేనన్నారు. 2029లో మన పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నూతన కమిటీలు వేస్తున్నామన్నారు. ఈ సారి సభ్యత్వంతోపాటు బీమా కూడా ఉంటుందని ప్రసాదరాజు చెప్పారు.
ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదు: గుడాల గోపి
పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నవరత్నాలు అమలు చేశారన్నారు. ఏడాది కాలంలో ఒక కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. తల్లికి వందనం పథకంలో కోత విధించడంతోపాటు 20 శాతం తల్లులకు అసలు డబ్బులు వేయలేదన్నారు. ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి అసలు అమలుకే నోచుకోలేదన్నారు.
మోసానికి ప్రతిరూపం కూటమి ప్రభుత్వం: కవురు
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయారన్నారు. అవినీతి, లంచాలకు తావులేని ప్రభుత్వం జగనన్నదైతే మోసానికి ప్రతిరూపం కూటమి ప్రభుత్వానిదన్నారు. నరసాపురం పార్లమెంటు ఇన్‌చార్జి ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ అన్ని వర్గాలు, కులాలు ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి మనమంతా సినిమా చూపిద్దామన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేసే వరకు ప్రజల తరఫున మనమే పోరాటం చేయాలన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు గుణ్ణం నాగబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అడిగిన వారిపై కేసులు పెడుతూ పబ్బం గడుపు కుంటుందని విమర్శించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ మాట్లాడుతూ మూడు పర్యాయాలుగా నిమ్మల రామానాయుడు నెగ్గితే నియోజకవర్గంలో అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంత్రి నిమ్మలది ప్రచారార్భాటమే కానీ ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ రవికుమార్, వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి, పాలకొల్లు, పోడూరు జెడ్పీటీసీ సభ్యులు నడపన గోవిందరాజులునాయుడు, గుంటూరి పెద్దిరాజు నాయకులు పొత్తూరి బుచ్చిరాజు, ఓదూరి భాస్కరరావు, ఇలపకుర్తి నరసింహారావు, చల్లా విశ్వేశ్వరరావు, నిమ్మకాయల రామకృష్ణ, పెచ్చెట్టి కృష్ణాజీ, బొంతు వెంకట కర్ణారెడ్డి, రావూరి వెంకటరమణ బుజ్జి, మేడిది విజయ జ్ఞానమణి, మద్దా చంద్రకళ, పాలంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
యలమంచిలిలో పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం