
వృద్ధుల సంరక్షణ పిల్లల బాధ్యత
కలెక్టర్ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): వృద్ధులైన తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 260 అర్జీలు స్వీకరించారు.
వృద్ధురాలికి భరోసా : నరసాపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వృద్ధురాలు బండి వెంకట నరసమ్మ (90) తనకు ముగ్గురు కుమారులని, ఒక కుమారుడు తన స్థలంలో ఇల్లు నిర్మించుకుని, తనను చూడటం లేదంటూ కలెక్టర్‌ను ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఎవరి సాయం లేకుండా వచ్చిన నరసనమ్మ వద్దకు కలెక్టర్ వెళ్లి ఆమె సమస్య తెలుసుకుని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్తులు రాయించుకుని వృద్ధులను బయ టికి పంపిస్తే, రాసిన ఆస్తులు చెల్లవని వృద్ధులు వాటిని తిరిగే పొందే హక్కు ఉందన్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడాల్సిన బాధ్యత పిల్లల దే అన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు.
ఎస్సీ పేటలో పాఠశాలను కొనసాగించాలి
పెనుమంట్రలో గత ప్రభుత్వంలో నాడు–నేడులో అభివృద్ధి చేసిన ఎస్సీ పేటలోని ప్రాథమిక పాఠశాలను అనుసంధానం పేరుతో పాడైన మరో స్కూల్‌లోకి మార్చేందుకు దొంగచాటుగా తీర్మానం చేశారంటూ పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్లి ప్రియాంక, ఓ విద్యార్థి తల్లి బొడ్డుపల్లి సత్యవతి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో 35 మంది పిల్లలు ఉన్నారని, వీరంతా మరోచోట ఏర్పాటుచేసిన స్కూల్‌కు వెళ్లకుండా ఎస్సీ పేటలోని పాఠశాలలో ఉన్నారని, వీరికి మ ధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, ఉపాధ్యాయులు రా వడం లేదన్నారు. స్కూల్‌ను యథాతథంగా ఉంచాలని ధర్నాలు, దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.