
అరకమ కేసులతో భయపెట్టలేరు
వీరవాసరం: ఎంపీ మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తారని వైఎస్సార్‌సీపీ భీమవరం ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. భీమవరంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారనే విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను హింసించాలి, భయపెట్టాలి అనే ప్రభుత్వ ఆలోచన ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లిక్కర్ పాలసీని అపహాస్యం చేసేలా ప్రస్తుత ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ఎటువంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా గతంలో లిక్కర్ పాలసీ అమలు చేశారన్నారు. కావాలనే వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసి మరీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారన్నారు. నాయకులు ఏఎస్ రాజు, జి.రామరాజు, చవాకుల సత్యనారాయణమూర్తి, జల్లా కొండయ్య, మానుకొండ ప్రదీప్ కుమార్, పెనుమాల నరసింహస్వామి, వీరవల్లి శ్రీనివాస్, ఎరక రాజు ఉమాశంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.