
కొందరికే వందనం
కొందరికి అరకొరగానే..
ఒక్కో విద్యార్థికి రూ.13 వేలకు గాను కొంతమంది తల్లులకు రూ.8,500 నుంచి రూ.9,000 మాత్రమే జమయ్యాయి. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా మీ అకౌంట్‌కు జమచేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ వాటా త్వరలో జమచేయబడుతుందంటూ తక్కువ మొత్తం జమైన లబ్ధిదారుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు రావడం గమనార్హం. దాదాపు నెలరోజులు కావస్తున్నా కేంద్రం వాటా రాకపోవడంతో వస్తుందో? లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని, అందరికీ ఒకేసారి ఇచ్చేవారని చెబుతున్నారు.
సెంటు భూమి లేకున్నా 46 ఎకరాలు చూపిస్తూ..
‘తల్లికి వందనం ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. నా పేరిట ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్న 46 ఎకరాల భూమిలో పై ఆరు ఎకరాలు తమకు అప్పగిస్తే చాలు’ అంటున్నాడు వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన తోట పెద్దిరాజు. తాను వ్యవసాయ పనులు చేస్తుంటానని, తమ ఇద్దరు కుమార్తెలు రాయకుదురు జెడ్పీ హైస్కూల్‌లో చదువుకుంటున్నారన్నారు. సెంటు భూమి కూడా లేని తనకు రాయకుదురు, కొణితివాడ గ్రామాల్లో ఏకంగా 46 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులో ఉండటంతో మొదటి విడతలో తల్లికి వందనం సాయం అందలేదన్నారు. సచివాలయ సిబ్బంది సూచన మేరకు రెండు గ్రామాల్లోనూ తన పేరిట భూమి ఏమీ లేదని వీఆర్వోల స్టేట్‌మెంట్ తీసుకుని గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపాడు. అయినా ఒక్క రూపాయి సాయం కూడా రాలేదని చెబుతున్నాడు. తనదిగా చూపిస్తున్న 46 ఎకరాల భూమిలో 40 ఎకరాలు తీసేసుకుని ఆరు ఎకరాలు స్వాధీనం చేస్తే ఎంతో సంతోషిస్తానంటూ ప్రభుత్వంపై తనదైన శైలిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన ఒక్కరే కాదు అర్హత ఉన్నా తల్లికి వందనం అందని ఎంతో మంది ఆవేదన ఇది.
సాక్షి, భీమవరం: తల్లికి వందనం పథకం అమలులో కూటమి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది. అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి వివిధ సాకులు పేరిట కొందరికి ఎగనామం పెడుతోంది. అర్హులుగా గుర్తించిన వారికి సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చకపోవడం గమనార్హం.
1,920 పాఠశాలలు..
2.79 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠఠశాల్లోని విద్యార్థులు 2,79,204 మంది వరకు ఉండగా, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులు 37,124 మంది ఉన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మొత్తం 3,16,328 మంది ఉన్నారు. వీరిలో 2,29,106 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. మండలాలతో పోలిస్తే విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున రూ. 343.81 కోట్లను వారి తల్లుల ఖాతాలకు జమచేయాల్సి ఉంది. పాఠశాలల నిర్వహణ పేరిట రూ. 2,000 తగ్గించి గత నెల 12న మొదటి విడతగా జిల్లాలోని 1,76,574 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లుల ఖాతాలకు రూ.229.55 కోట్లను జమచేసింది.
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలంటూ..
10వ తరగతి పూర్తయి ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు తర్వాత అందజేస్తామని, సాంకేతిక పరమైన అవరోధాలతో ఆగిన వారు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసుకోవా లని అధికారులు సూచించారు. ఈ మేరకు 20,139 మంది నుంచి వినతులు వచ్చాయి. ఇటీవల వీటిలోని 11,416 మందికి తల్లికి వందన సాయాన్ని, 1,137 మందికి సాయం అందించాల్సి ఉందని, 4262 మంది దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కాగా ఫోర్ వీలర్, స్థలం, ఇన్‌కంటాక్స్, ప్రభుత్వ ఉద్యోగి, విద్యుత్ బిల్లులు తదితర వాటిని సాకుగా చూపించి 4,693 మంది దరఖాస్తులను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 1,87,990 మందికి సాయం అందించగా మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తమకు సొంత ఇళ్లు కూడా లేకపోయినా తమ పేరిట స్థలాలు ఉన్నాయని, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని తదితర రకరకాల సాకులతో సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారని అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఎంతమందికి సాయం అందిందనే విషయంపై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదని ఉద్యోగ వర్గాలంటున్నాయి.
మండలాల వారీగా అర్హులు
మండలం అర్హులు
ఆచంట 5,354
ఆకివీడు 9,610
అత్తిలి 6,196
భీమవరం 33,928
యలమంచిలి 5,286
గణపవరం 7,406
ఇరగవరం 4,211
కాళ్ల 6,780
మొగల్తూరు 7,657
నరసాపురం 20,193
పాలకొల్లు 21,267
పాలకోడేరు 5,410
పెంటపాడు 7,302
పెనుగొండ 11,039
పెనుమంట్ర 5,697
పోడూరు 5,242
తాడేపల్లిగూడెం 25,881
తణుకు 27,775
ఉండి 6,413
వీరవాసరం 6,459
తల్లులకు ఎగనామం
పూర్తిస్థాయిలో అర్హులకు అందని తల్లికి వందనం లబ్ధి
ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106 మంది
మొదటి విడతలో 1,76,574 మంది, గ్రీవెన్స్‌లో 11,416 మందికి జమ
మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరం
విద్యుత్ బిల్లులు, ఫోర్ వీలర్ల పేరిట తాత్సారం

కొందరికే వందనం

కొందరికే వందనం