
10న పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం
భీమవరం: జూలై 10న జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, జూనియర్ కాలేజీలో నిర్వహించే మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశానికి సంబంధించి శనివారం జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులను ఆహ్వానించాలన్నారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి మొక్కను నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ ఏడీ ఎన్.సత్యనారాయణ, ఫారెస్ట్ అధికారి డి.ఆశా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.