
పండ్ల తోటల పథకంతో లబ్ధి
పాలకోడేరు: ఉపాధి హామీ పథకంలో సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి పొలాల్లో పండ్లతోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం పాలకోడేరు మండలం కుముదవల్లి పంచాయతీలో కలిదిండి సూర్యనారాయణ రాజు వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకం ద్వారా సన్న చిన్నకారు రైతులకు ఆదాయాన్ని సమకూర్చాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం 450 ఎకరాలలో ఉద్యాన తోటల పెంపకాన్ని ప్రారం భించామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, ఏపీడి పి.సుజాత, సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణంరాజు పాల్గొన్నారు.
14 వరకూ పశుగ్రాస వారోత్సవాలు
భీమవరం (ప్రకాశంచౌక్): పశుగణాభివృద్ధితో పాటు మేలు రకం పశుగ్రాసల సాగు ద్వారా అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదలకు జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వారోత్సవాలు సందర్భంగా పాడి రైతులకు 75 శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలను అందించనున్నట్లు తెలిపారు. సొంత భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, చిన్న, సన్నకారు రైతులు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల విస్తీర్ణంలో మేలుజాతి పశుగ్రాసాలు పెంచితే ఉపాది హామీ పథకంలో లబ్ధి చేకూరుతుందన్నారు.