
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
భీమవరం(ప్రకాశం చౌక్): పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. భారీ వర్షాలకు డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. కనీసం కచ్చడ్రైయిన్లు కూడా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. కొన్ని గ్రామాలల్లో డ్రెయినేజీల్లో పూడిక తీయక గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో మురుగునీరు వెళ్లే దారిలేక రోడ్లపైకి వస్తోంది. దోమల వృద్ధి చెందడంతో ప్రజలు రోగాల పాలువుతున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో మొత్తం 409 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఎక్కువ శాతం పంచాయతీల్లో ఇదే పరిస్థితి.
పట్టించుకోని పంచాయతీ సెక్రటరీలు
పంచాయతీ సెక్రటరీలు కూడా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు స్పందిస్తున్నారు. గ్రామం మొత్తం డ్రెయిన్లు బాగుచేయించడం లేదు. వర్షాకాలం రాక ముందే గ్రామాల్లోని డ్రెయిన్లు బాగు చేయించాలి. కనీసం కచ్చా కచ్చా డ్రెయిన్లు తవ్వించాలి. ఏ పంచాయతీలోనూ వీటిపై దృష్టిపెట్టడం లేదు. దాంతో మురుగునీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిలో గ్రామాల్లో బ్లీచింగ్, దోమల నివారణకు చర్యలు లేవు. కొన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండకపోవడంతో చెత్తను రోడ్లు, కాలువ గట్లపై డంప్ చేస్తున్నారు. వర్షాకాలంలో తాగునీటి క్లోరినేషన్ మాత్రమే చేయిస్తున్నారు. మండల స్థాయి అధికారులు రోజుకు ఒక గ్రామంలో తిరుగుతూ మంచి నీటి ట్యాంకుల శుభ్రం, క్లోరినేషన్ చేయించి చేతులు కడుక్కుంటున్నారు.
అధ్వానంగా డ్రెయినేజీ వ్యవస్థ
వర్షాలకు రోడ్లపైకి మురుగునీరు
చర్యలు తీసుకుంటాం
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజి వ్యవస్థ అభివృద్ధికి చర్యలు చేపడతాం. నీరు నిల్వ ఉండకుండా కచ్చా డ్రెయిన్లు తవ్విస్తాం. బ్లీచింగ్ చల్లించడంతో పాటు ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ మందులు పిచికారీ చేయిస్తాం.
– ఎన్.రామనాథ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం