
ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలి
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ఫిర్యాదులకు చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అడిషినల్ ఎస్పీ వి.భీమారావు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా 11 అర్జీలు స్వీకరించారు. వీటిలో వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు వంటివి ఉన్నాయి.
డీఎస్సీ పరీక్షకు 96 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో సోమవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 96 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. మూడు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 360 మందికి 347 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని తెలిపారు.
పీజీ సెట్‌లో 3వ ర్యాంకు
గణపవరం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన పీజీ సెట్ ఫలితాలలో గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ నిర్మలకుమారి తెలిపారు. జువాలజీలో కె.కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో 3వర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఆమెతో పాటు మరో 8 మంది వెయ్యిలోపు ర్యాంకులు సాధించారన్నారు. రూపశ్రీ బోటనీలో 22వ ర్యాంకు, ఎస్.సంధ్యారాణి 70వ ర్యాంకు, కె.బాహ్యలహరి 74వ ర్యాంకు సాధించారని, కెమిస్ట్రీలో బేబీ శిరీష 96వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్, అధ్యాపకులు సోమవారం అభినందించారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
పెదవేగి: వైఎస్సార్‌సీపీ నేతలకు కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని సీనియర్ న్యాయవాదులు అల్తి శ్రీనివాస్, బైగాని రంగరావులు అన్నారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా భీమడోలుకు చెందిన అల్తి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా పెదవేగి మండలం విజయరాయికి గ్రామానికి చెందిన బైగాని రంగారావు నియమితులయ్యారు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వీరిని నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఖండించారు. రానున్న రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చినా సమాచారం అందిస్తే అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏలూరు జిల్లాలోని అన్ని డిపోల నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జూలై 8న సాయంత్రం 6 గంటలకు బస్సులు బయలుదేరి 9న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం దర్శనం అనంతరం ఆ రోజు రాత్రికి అరుణాచలం చేరుకుంటాయన్నారు. 10వ తేదీ ఉదయం గిరి ప్రదక్షిణ అనంతరం కంచిలోని కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి గమ్యస్థానాలకు సర్వీసులు బయలుదేరుతాయన్నారు. టిక్కెట్ రూ.3 వేలుగా నిర్ణయించామని తెలిపారు. మిగిలిన ఖర్చులు ప్రయాణికులు భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో ప్రతి ఆదివారం అమ్మవార్ల దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని, ఈ బస్సులు మూడు డిపోల నుంచి తెల్లవారు జామున 4 గంటలకు బయలుదేరి దర్శనానంతరం గమ్యస్థానానికి చేరుకోవచ్చునన్నారు. టిక్కెట్లు కావాల్సినవారు ఏలూరు 93467 67670, రిజర్వేషన్ కౌంటర్ 63038 59484, జంగారెడ్డిగూడెం 9194929 49350, నూజివీడు 73829 01757 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.