
సప్త ప్రదక్షిణల్లో పాల్గొన్న భక్తులు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో నాల్గవ సోమవారం సప్త ప్రదక్షిణలు నిర్వహించారు. చేతిలో ఏడు మారేడు దళాల పత్రాలను పట్టుకుని స్వామివారి మాడ వీధుల్లో వేలాది సంఖ్యలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి పంచహారతుల కార్యక్రమం జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
కాట్రేనిపాడు విద్యార్థికి శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 4వ ర్యాంకు
ముసునూరు: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన దేవరపల్లి మోక్షజ్ఞ అక్షిత్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించినట్లు తండ్రి సురేష్ తెలిపారు. తమ కుమారుడు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ లెవెల్ శ్రేష్ఠ ప్రవేశ పరీక్ష రాశాడన్నారు. నాలుగవ ర్యాంకుతో సీబీఎస్‌ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 9వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించినట్లు చెప్పారు. విద్యార్థి మోక్షజ్ఞ అక్షిత్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.