
ఏడాదైనా రోడ్డెక్కని ప్రగతి
పొలమూరు– నవుడూరు జంక్షన్ మధ్య 60 మీటర్ల మేర భారీ గోతులతో ప్రయాణికులు ప్రమాదాలు పాలవుతున్నారు. గత ప్రభుత్వంలో 500 మీటర్ల మేర సీసీ రోడ్డు, 500 మీటర్ల బీటీ రోడ్డు నిర్మించారు. 60 మీటర్లు మేర సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెబుతున్నారు.
సాక్షి, భీమవరం: అధికారంలోకి రావడమే ఆలస్యం.. రోడ్లను అద్దంలా మారుస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు తర్వాత ఆ ఊసే మరిచారు. ప్యాచ్ వర్కులు, అత్యవసర పనుల పేరిట జిల్లాలోని స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లలో తూతూమంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. రూ.42.57 కోట్ల విలువైన 181 పనులకు బిల్లులు రాక 70 శాతం పనులు పూర్తికాలేదని అంచనా. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేయడంతో గోతులు యథాస్థితికి చేరుతున్నాయి. కొన్ని చోట్ల గుంతల్లో కంకర, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి రోడ్డంతా చెల్లాచెదురై ప్రమాదభరితంగా తయారయ్యాయి. దీంతో ఈ రోడ్లు మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
గతంలోనే రోడ్ల అభివృద్ధి
గత ప్రభుత్వం రోడ్లను అభివృద్ధి చేయకపోవడంతో గుంతలమయంగా మారాయంటూ అప్పట్లో కూటమి నేతలు విషం చిమ్మారు. ప్రాధాన్య క్రమంలో రోడ్లను అభివృద్ధి చేస్తూ వచ్చిన విషయాన్ని కప్పిపుచ్చారు. చివరి ఏడాదిలోనూ గత ప్రభుత్వం సుమారు రూ.131.2 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. వీటిలో అల్లంవారిలంక, కేపీపాలెం బీచ్ రోడ్డు, బియ్యపుతిప్ప– కేపీ పాలెం నార్త్, ఏలేటిపాడు బ్రిడ్జి అప్రోచ్, మార్టేరు– ప్రక్కిలంక రోడ్డు పనులు అప్పట్లోనే దాదాపు పూర్తయ్యాయి. మిగిలినవాటిలో కొత్తోట–దెయ్యాలతిప్ప, వెంప–కాళీపట్నం, కాళీపట్నం–జగన్నాథపురం, లక్ష్మణేశ్వరం–పెదమైనవానిలంక, తణుకు– వేల్పూరు, దువ్వ–ఆరుళ్ల, ఐతంపూడి–కొత్తపాడు, ఉరదాళ్లపాలెం–దువ్వ, కొమరవరం– ఈస్ట్ విప్పర్రు, సీతారాంపురం– పేరుపాలెం, నర్సాపురం– అశ్వారావుపేట రోడ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరుచేసి దాదాపు పూర్తిచేసిన రోడ్లను తామే చేసినట్టుగా చెప్పుకునే పనిలో కూటమి నేతలు ఉన్నారు.
రోడ్ల అభివృద్ధికి చొరవ చూపని ప్రభుత్వం
అరకొర మరమ్మతులతో సరి
అధ్వానంగా తయారైన రోడ్లతో ప్రజలు అవస్థలు
కాళ్ల మండలంలో కోలనపల్లి నుంచి కుప్పనపుడి వరకు కొంతమేర మరమ్మతులు చేయక 2 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా ఉంది. గోతులు పడి వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. ఈ రోడ్డుపై రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి నుంచి ఏలూరుపాడు వరకు రోడ్డు ప్రమాదభరితంగా ఉంది.
భీమవరం–శృంగవృక్షం నుంచి వేండ్ర మీదుగా అటు కొండేపూడి ఇటు పాలకోడేరు వెళ్లే పైపుల చెరువు రోడ్డు అధ్వానంగా తయారైంది. విస్సాకోడేరు లాకుల నుంచి భీమవరం వరకు కిలోమీటరు మేర ఇటీవల నల్ల చిప్స్ వేసి వదిలేశారు. భీమవరం నుంచి వేండ్ర రైల్వే గేటు వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు మీదుగా జిల్లా కేంద్రానికి రోజు వందలాది మంది ప్రయాణిస్తుంటారు.

ఏడాదైనా రోడ్డెక్కని ప్రగతి

ఏడాదైనా రోడ్డెక్కని ప్రగతి