
ఆవకాయ పెట్టలేం.. కొంటాం!
ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చడికి అవసరమైన సరకులు దొరుకుతున్నాయి. వీటి ధరలు పరిశీలిస్తే..
లావు మిరపకాయల కారం కిలో రూ.560
వేరుశనగ నూనె కిలో రూ.155
పప్పు నూనె కిలో రూ.450
ఆవాలు కిలో రూ.120
మెంతులు కిలో రూ.120,
వెల్లుల్లి కిలో రూ.140
క్వాలిటీని బట్టి ధరలు మారుతున్నాయి.
మామిడి కాయల ధరల విషయానికొస్తే..
ఆవకాయకు వాడే
చిన్న రసాలు వంద రూ.1000
దేశవాళీ కాయలు రూ.1000
సువర్ణరేఖ రూ.1500
ఐజర్లు రూ.1500
కొత్తపల్లి కొబ్బరి రూ.1800
మాగాయి పచ్చడికి వాడే పెద్ద రసాలు వంద కాయలు రూ.1200 వరకూ విక్రయిస్తున్నారు.
పాలకొల్లు సెంట్రల్: వేసవి వస్తే ఇళ్లలో ఆవకాయ సందడి మొదలవుతుంది. ఆవకాయ పచ్చడి ఉంటే చాలు ఆ రోజుకు కూర అవసరం లేదనేది ఆంధ్రుల నమ్మకం. ముద్దపప్పుతో ఆవకాయ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. సంవత్సరం మొత్తానికి సరిపడేలా మామిడితో రకరకాల పచ్చళ్లు తయారు చేసి జాగ్రత్త చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలో ఆవకాయ పెట్టుకునే వారి సంఖ్య తగ్గింది. మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరుకుతుండడంతో వాటితోనే సరిపెట్టుకుంటున్నారు.
వేసవి సీజన్ వస్తుందంటే మహిళలు పచ్చడి తయారీలో బిజీగా గడిపేవారు. అయితే ఇప్పటి బిజీ లైఫ్‌లో ఆవకాయ పెట్టలేం.. కొంటాం అంటున్నారు మహిళలు.. ఇప్పుడు అన్ని మార్కెట్‌లోనే కొనేస్తున్నారు. మామిడి కాయల ముక్కలు కూడా మార్కెట్‌లో అమ్ముతున్నారు. కారం, శుభ్రం చేసిన మెంతులు, ఆవాలు, వెల్లుల్లి పాయలు ఇలా పచ్చడి తయారీకి కావలసిన అన్ని రకాల సరుకులు దొరుకుతున్నాయి. ఇప్పటికీ కొందరు అన్నీ ఇంట్లోనే తయారుచేసుకుని పచ్చడి పెడుతుంటే.. కొందరు మాత్రం అవసరమైన దినుసులు మార్కెట్‌లో కొనుగోలు చేసి పచ్చళ్లు పెడుతున్నారు. మరికొందరు ఈ గొడవ అంతా ఎందుకని.. రెడీమేడ్ పచ్చళ్లు కొనేస్తున్నారు. జనంలో నేడు పచ్చడిపై మక్కువ తగ్గడానికి కారణం రెడీమేడ్‌గా నాణ్యమైన పచ్చళ్లు మార్కెట్లో దొరకడం. అలాగే పచ్చడికి అవసరమైన సరకుల ధరలు పెరగడం. పిల్లల చదువులు, ఫోన్లతో బిజీగా ఉండడం వంటివి..
ఇదివరకటిలా పెట్టేంత తీరిక లేదంటున్న మహిళలు
అవసరమైన సరకులు మార్కెట్‌లో కొంటున్న వైనం
రెడీమేడ్ పచ్చడి కొనేందుకు మరికొందరు మొగ్గు
సొంతంగా పెట్టుకుంటేనే రుచి
పచ్చడి నిల్వ ఉండాలంటే సొంతంగా తయారు చేసుకుంటేనే మేలు. గానుగ నూనె వాడుకోవడం మంచిది. పూర్వం రెండు మూడు కుటుంబాల మహిళలు కలిపి పచ్చడి పెట్టేవారు. నేడు ఎవరి పని వారిదే అన్నట్లు ఉంది. మార్కెట్ రెడీమేడ్ పచ్చళ్లు దొరుకుతుండడంతో పచ్చళ్లు పెట్టడానికి కొంతమంది మొగ్గు చూపడంలేదు. ఎంత కష్టమైనా కనీసం పాతిక కాయలతోనైనా తయారు చేసుకుని రుచిచూడాల్సిందే.
దూడే వరలక్ష్మి, గృహిణి, పాలకొల్లు
మామిడి ధరలు తగ్గాయి
తూర్పుగోదావరి జిల్లాలో గూడపల్లి, లక్కవరం, బట్టేలంక, పశ్చిమగోదావరి జిల్లాలో సీతారామపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి మామిడి కాయలు ఖరీదు చేస్తుంటాం. గత సంవత్సరంతో పోలిస్తే.. కాపు ఎక్కువగా ఉండడం వల్ల ధరలు బాగా తగ్గాయి. ఐజర్లు, కొత్తపల్లి కొబ్బరి గత సంవత్సరం కాయ రూ. 35 నుంచి 50 వరకూ విక్రయించాం. ఈ సంవత్సరం రూ.15 నుంచి రూ.20కి విక్రయిస్తున్నాం.
– కటకంశెట్టి మల్లి, వ్యాపారి, పాలకొల్లు

ఆవకాయ పెట్టలేం.. కొంటాం!

ఆవకాయ పెట్టలేం.. కొంటాం!

ఆవకాయ పెట్టలేం.. కొంటాం!