
రూ.75 కోట్ల పనులు రద్దు!
సాక్షి, భీమవరం: ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ప్రజల ఆశలపై కూటమి నీళ్లు చల్లింది. టెండర్ల దశకు చేరిన రూ.75.28 కోట్ల విలువైన ఏడు పనులకు బ్రేక్ వేసింది. ఆ పనులు మొదలు పెట్టాలని కూటమి నేతలు కోరినా ఫలితం లేదు. సమస్యను ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పనులు జరిగేట్టు చూడాలని కోరినట్టు సమాచారం.
అప్రోచ్‌లకు మోక్షం కలిగేనా?
డెల్టా ఆధునికీకరణలో భాగంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. గొల్లవానితిప్ప, దొంగపిండి, పట్టణంలో రెస్ట్‌హౌస్ రోడ్డు వద్ద వంతెనలు నిర్మించారు. నిధులు చాలక అప్పట్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆయన స్పందించి అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.36.71 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాళీపట్నం–భీమవరం వంతెన వద్ద రూ.9.22 కోట్లు, భీమవరం–దొంగపిండి వంతెన వద్ద రూ.16.58 కోట్లు, దెయ్యాలతిప్ప–నాగిడిపాలెం వంతెన వద్ద రూ.10.91 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈలోపు ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది.
అవసరమని చెప్పినా.. ఆయా పనుల ఆవశ్యకత దృష్ట్యా పనులు రద్దు కాకుండా కొనసాగించాలని కూటమి నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ప్రజాప్రతినిధులు ఈ విషయం తీసుకువెళ్లారు. రద్దు చేయకుండా వాటిని కొనసాగించాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా ఆ పనులకు మరలా అంచనాలు రూపొందించి, ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపితే సాంకేతిక, పాలన అనుమతులు వచ్చి, టెండర్ ప్రక్రియ మొదలయ్యేసరికి చాలా సమయం పడుతుందని పలువురు అంటున్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ఆశలు ఆవిరి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్రోచ్‌లు, రోడ్లకు నిధులు
టెండర్ల దశకు చేరిన పనులకు బ్రేక్ వేసిన కూటమి సర్కారు
ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు
పనులు కొనసాగించాలని వినతి
అటకెక్కిన పనులు
గత ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గంలోని చినమిల్లిపాడు, సిద్ధాపురం, రాజులపేట, రాజుల కొట్టాడ, ధర్మాపుర అగ్రహారం, నల్లమిల్లిపాడు గ్రామాలు, కొల్లేరు తీర ప్రాంత ప్రజలు, రైతులు చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదభరితంగా ఉన్న ఈ రోడ్డును 11.6 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టి అభివృద్ధి చేసేందుకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి.
భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బొండాడ డ్రెయిన్లపై వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు.
ఆచంట నియోజకవర్గంలో నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్‌అండ్‌బీ ఇన్‌స్పెక్షన్ బంగ్లాల ఆధునికీకరణ నిమిత్తం రూ.1.57 కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులు దాదాపు టెండర్ల దశకు చేరుకోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అటకెక్కించింది.

రూ.75 కోట్ల పనులు రద్దు!