
ఆస్థాన విద్వాంసుడిగా కేవీ సత్యనారాయణ
ద్వారకాతిరుమల : శ్రీవారి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా తనను ప్రకటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సినీ నృత్య దర్శకుడు, నాట్య కళా విశారద కేవీ సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన నాట్యం ద్వారా శ్రీవారిని సేవిస్తున్నట్టు చెప్పారు.
అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు
భీమవరం (ప్రకాశంచౌక్): ‘అందరికీ ఇళ్లు’ (హౌసింగ్ ఫర్ ఆల్) పథకం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు భూమిని ఇంటి స్థలంగా కేటాయించేందుకు ప్రభుత్వం మార్గదర్శక, నిబంధనలు జారీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పథకానికి సంబంధించి సందేహాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నివృత్తి చేసికొవచ్చు. ఈ పథకాన్ని అర్హత ఉన్న లబ్ధిదారులు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 574 మంది గైర్హాజరు
భీమవరం: జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల్లో 574 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలను 40 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా జనరల్ కేటగిరిలో 9,525 మందికి 9,111 మంది హాజరుకాగా ఒకేషనల్ కేటగిరిలో 557 మందికి 58 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష 18 కేంద్రాల్లో నిర్వహించగా జనరల్ కేటగిరిలో 1,300 మందికి 1,214 మంది హాజరుకాగా ఒకేషనల్ కేటగిరిలో 180 మందికి 162 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నాగేశ్వరరావు తెలిపారు.
పాలిసెట్‌లో 6,169 మంది ఉత్తీర్ణత
భీమవరం: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో జిల్లాల్లో 95 శాతం విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ఫణీంద్ర ప్రసాద్ చెప్పారు. పాలిసెట్ పరీక్షకు 7,271 మంది పరీక్ష ఫీజులు చెల్లించగా 6,489 మంది పరీక్షకు హాజరయ్యారని వీరిలో 6,169 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. పాసైన వారిలో 3,634 మంది బాలురు, 2,535 మంది బాలికలు ఉన్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో బి.శేఖర్ 4వ ర్యాంకు సాధించగా, వి.ప్రవల్లిక 6వ ర్యాంకు, కె.కృష్ణ ప్రణయ్ 9వ ర్యాంకు సాధించారని ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు.
రెవెన్యూ పిటిషన్లు సత్వరం పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఫేజ్ –1 రీసర్వే మే నెలాఖరునాటికి పూర్తిచేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం జాయింట్ కలెక్టర్ చాంబరులో జాయింట్ కలెక్టర్ రీ సర్వే, పీజీఆర్‌ఎస్, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అధికారులతో సమీక్షించారు. ఫేజ్ 2 రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారంలో ఏఐ టెక్నాలజీని వాడి సమస్యలు నాణ్యతతో పరిష్కరించుకోవచ్చన్నారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించేందుకు మార్గదర్శకాలతో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు.
వర్క్ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు
నూజివీడు: మండలంలోని సుంకొల్లులో గృహనిర్మాణలకు సంబంధించి సిమెంట్, స్టీలు అవకతవకల విషయంలో గృహనిర్మాణ శాఖలో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఐదుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ జిల్లా అధికారి జీవీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు సంబంధించిన మెటీరియల్ పక్కదారి పట్టిందని వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని గృహ నిర్మాణశాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. విచారణలో 2,450 బస్తాల సిమెంట్, 11,952 కిలోల స్టీలు లబ్ధిదారులకు అందలేదని తేలింది.