దంపతుల ఆత్మహత్యాయత్నం
పాలకొల్లు సెంట్రల్ : ఆర్థిక సమస్యలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాలకొల్లులో జరిగింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న మాదు శ్రీనివాస్ దంపతులు శుక్రవారం మధ్యాహ్నం పెళ్లికి వెళ్తున్నామని చెప్పి ఆగర్తిపాలెంలో తమ పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగేశారు. బంధువుల కథనం ప్రకారం కుమార్తెకు కూడా పురుగుల మందు కలిపిన గ్లాస్ ఇవ్వగా వాసన వస్తుంది.. తాగలేను అనడంతో భార్యాభర్తలిద్దరూ పురుగుమందు తాగారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వారిద్దరిని పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యా యత్నానికి ముందు శ్రీనివాస్ వీడియో రికార్డు చేశారు. ‘నాకు అప్పులున్నాయి.. నేను జనం వద్ద తెచ్చుకున్న నగదు సుమారు రూ.10 లక్షల వరకూ తీర్చాలి. వాటిని తీర్చాలంటే నేను అప్పు ఇచ్చిన వ్యక్తి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అతను ఇవ్వడం లేదు. అడుగుతుంటే కక్ష గట్టి నా సంగతి చూస్తానంటున్నాడు. నాకు న్యాయం జరగాలంటే ఆత్మహత్య ఒక్కటే శరణ్యం. నేను, నా భార్య, కుమార్తె విషం తీసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తరువాతైనా రావాల్సిన నగదు తీసుకుని బాకీలు సెటిల్ చేసి మిగిలింది మా అక్క, బావలకు ఇప్పించాలని కోరుతున్నాం’అంటూ వీడియోలో పేర్కొన్నాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం శ్రీనివాసు రూ.2.50 లక్షలు ఇచ్చాడు. ఆ నగదుతో పొలం కొన్నారని, ఇప్పుడు తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాసు కోరుతున్నాడని చెప్పారు.


