
పంటు ప్రయాణికులపై చార్జీల బాదుడు
నరసాపురం: నరసాపురం వశిష్ట గోదావరి పంటు ప్రయాణికులపై కూటమి ప్రభుత్వం వచ్చాక అదనపు చార్జీల భారం పడింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రేవు నిర్వహణ హక్కులు దక్కించుకున్న గుత్తేదారు మంగళవారం నుంచి రేవు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. మోటార్ సైకిల్‌తో పాటు ఒక మనిషికి గతంలో రేవు దాటడానికి రూ.35 ఉండేది. అకస్మాత్తుగా ఆ చార్జీని రూ.40 కు పెంచారు. మోటార్ సైకిల్‌కు రూ.5 పెంచడం ద్వారా పంటు ప్రయాణికులపై రోజుకు రూ.50 వేల అదనపు భారం పడనుంది. రేవులో పంటుపై రోజుకు సగటున వెయ్యి బైక్‌లు అటు, ఇటు దాటతాయి. చార్జీలు పెరగడంతో పంటు ప్రయాణాల సంఖ్య తగ్గనుంది. దీని ప్రభావం నరసాపురం మార్కెట్ వ్యాపారాలపై పడింది. పట్టణంలో మార్కెట్ కార్యకలాపాలు తగ్గుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్లు, ఆటోలు, ఇతర వాహనాల చార్జీలు పెంచే ఆలోచనలో పాటదారులు ఉన్నట్టు సమాచారం. గత వైఎస్సార్‌సీపీ సర్కార్ హయంలో రేవు పాట ఏటేటా పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అయితే పంటు చార్జీలు పెంచలేదు. ఈ ఏడాది రేవు పాటను రూ.4.18 కోట్లకు దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.50 లక్షల మేర పాట పెరిగింది. ఇప్పుడు పెంచిన, పెంచబోతున్న అదనపు చార్జీల బట్టి చూస్తే ఈ ఏడాది రేవు నిర్వహణలో లాభాలు కోట్లను దాటుతాయని అంచనా వేస్తున్నారు. రేవు నిర్వహణ హక్కులు దక్కించుకున్న సిండికేట్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే నాయకర్ వాటాదారుడిగా వెనకుండగా.. ఆయన సోదరుడు సునీల్ నాయకర్ కనుసన్నల్లో డమ్మీ గుత్తేదారులు ఈ యాక్షన్ డ్రామా నడిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాను గెలిస్తే పంటు చార్జీలు తగ్గించి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పంటు ద్వారా నరసాపురం రాకపోకలు పాగించే వారి సంఖ్య పెంచుతానని.. నరసాపురం మార్కెట్ స్థాయి పెరుగుతుందని ఎమ్మెల్యే నాయకర్ హామీలు గుప్పించారు. అయితే ఇప్పుడు దాని విరుద్ధంగా జరుగుతోంది.
బైక్‌కు రూ.5 పెంపు