
ఖోఖో విజేత మహిళా జట్టుకు షీల్డ్ అందిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ అభిలషించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను, షీల్డుల ఽప్రదాన కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలను నిర్వహించి నంబర్ వన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల నాయకులు సీఎం వైఎస్ జగన్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారన్నారు. పరిపాలనలో నూతన ఒరవడికి నాంది పలికారన్నారు. పరిపాలన విధానాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే అన్నారు. విద్యార్థులు, యువత విద్యతోపాటు క్రీడల్లో మేటిగా నిలవాలనే సంకల్పంతోనే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. దీనివలన యువత శారీరకంగా, మానసికంగా దారుఢ్యంగా తయారవుతారన్నారు. భవిష్యత్తులో ఎటువంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొనే సామర్ధ్యంతో ముందుకు సాగుతారన్నారు. పరిపాలన విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతోనే జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. క్రీడల్లో మన రాష్ట్రాన్ని దేశంలోనే ఆగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారన్నారు. దీనిని ప్రతి సంవత్సరం నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తారని చెప్పారు. క్రీడాకారులకు అనువుగా ఉండేందుకు తాడేపల్లిగూడెంలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి కొట్టు చెప్పారు. ఈ స్టేడియంలో క్రికెట్‌తోపాటు వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలు ఆడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకుని వచ్చే సంవత్సరం నిర్వహించే పోటీలో మరింత ఉన్నతంగా రాణించాలన్నారు. క్రీడలతోపాటు చదువుకు ప్రాధాన్యత నివ్వాలని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించిన తరువాత క్రీడా విభాగంలో ఉద్యోగాలు పాందవచ్చునన్నారు. ఈ క్రీడలను పరిశీలించిన వ్యాయామ ఉపాధ్యాయులు, మంచి నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను గుర్తించి వారితో ఆయా క్రీడలకు సంబంఽధించి టీమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విజేతలకు మెమెంటోలు, మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ భరత్‌రాజ్‌కుమార్, స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ కర్రి విజయలక్ష్మి, కర్రి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
నియోజకవర్గ స్థాయి పోటీల్లో విజేతలకు బహుమతులు, షీల్డ్‌ల అందజేత

క్రికెట్‌లో విజేత జట్టుకు బహుమతి షీల్డ్ అందిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ