బెంబేలెత్తిస్తున్న బైక్‌ రేస్‌లు | Illegal Bike race makes people into fear | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తిస్తున్న బైక్‌ రేస్‌లు

Apr 11 2023 12:58 AM | Updated on Apr 11 2023 1:23 PM

- - Sakshi

తణుకు: బైక్‌ రైసింగ్‌, వేగంగా బైక్‌ నడపాలన్న సరదా ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. తణుకు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. అలాగే అర్థరాత్రి పూట హైవేలపై రేసింగ్‌లు ప్రాణాంతకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

● కొద్ది రోజుల క్రితం కాలేజీ విద్యార్థినులు ప్రయాణిస్తున్న బస్సును యువకుడు బైక్‌పై వెంబడిస్తూ అదే బస్సు కింద పడి మరణించాడు. తణుకు మండలం వీరభద్రపురంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వేల్పూరుకు చెందిన యువకుడు మృతి చెందాడు.

● తణుకు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా కొండాలమ్మ పుంత రోడ్డులో కొందరు యువకులు బైక్‌ రేసింగ్‌ నిర్వహిస్తూ కళాశాల విద్యార్థులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు కాగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

● గతంలో తణుకులోని రవాణ శాఖ కార్యాలయం వద్ద డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న ఎంవీఐను అటుగా బైక్‌పై వెళుతున్న యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అప్పట్లో ఎంవీఐగా పని చేస్తున్న శ్రీనివాస్‌ గాయపడ్డారు. పరిమితికి మించిన వేగంతో వెళుతున్న వీరిలో వాహనం నడుపుతున్న యువకుడు మద్యం తాగి ఉన్నాడు.

● తాజాగా తణుకు పట్టణ పరిధిలోని వేల్పూరు రోడ్డులో ఇద్దరు యువకులు బైక్‌ రేసింగ్‌ నిర్వహిస్తూ ఆటోను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. స్థానిక భాష్యం స్కూలు వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక యువకుడు గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.

ఇలా మితిమీరిన వేగంతో బైక్‌లపై యువకులు హల్‌చల్‌ చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో పాటు ఇతరులను ప్రమాదంలో పడేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని యువత బైక్‌ విన్యాసాలు చేస్తూ అందరినీ భయపెడుతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. వీరి వేగానికి పాదచారులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో బైక్‌ రేసింగ్‌లు సైతం నిర్వహిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఇదే తంతు జరుగుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై బైక్‌ రేసింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు సైతం బైక్‌ రేసింగ్‌ల వైపు మళ్లుతున్నట్లు పోలీసులు అంగీకరిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న బైక్‌లను తమకు నచ్చిన విధంగా మార్చుకుని రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. మితిమీరిన వేగంతో శబ్దాలు చేస్తున్న వాహనాలను అదుపు చేయాల్సిన రవాణా, పోలీసు అధికారులు మాత్రం వాటిపై దృష్టి సారించడంలేదనే విమర్శలు ఉన్నాయి.

దొరికితేనే కేసులు

కళాశాలలు, స్కూళ్ల వద్ద కాపు కాస్తున్న యువకులు పెద్ద శబ్ధాలతో అమ్మాయిల దృష్టిలో పడేందుకు బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు సైతం రూ. 2 నుంచి రూ. 3 లక్షలు విలువ చేసే బైక్‌లపై కాలేజీలకు వస్తున్నారు. వీరికి తల్లిదండ్రులు బైక్‌లు కొనివ్వడంపైనా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తణుకు రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఒక కళాశాలకు బైక్‌లపై వచ్చిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో నిత్యం కృత్యంగా మారింది.

ప్రధాన రోడ్ల వెంట హల్చల్‌ చేస్తున్న యువకులు పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు నెంబర్‌ ప్లేట్లు తొలగిస్తున్నారు. దీంతో పోలీసులకు సవాలుగా మారింది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే వీరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

తల్లిదండ్రులదే బాధ్యత

తమ పిల్లలు కాలేజీ పేరుతో ఎక్కడి వెళ్తున్నారు.. బయట ఎలా వ్యవహరిస్తున్నారో తల్లిదండ్రులు గమనించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. విలువైన బైక్‌లు కొనివ్వడం ద్వారా విద్యార్థులు ఆకతాయిల్లా మారుతున్నారని హెచ్చరిస్తున్నారు. కాలేజీ పేరుతో బయటకు వచ్చి బృందాలుగా ఏర్పడి నిర్మానుష్య ప్రదేశాల్లో గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం. ఇలా మత్తులో బైక్‌లపై వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అడిగిన వారిపై కొందరు తిరగబడుతున్నారు. మైనర్లు బైక్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఇప్పటికై నా తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించి సన్మార్గంలో నడిపేందుకు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

రేసింగ్‌లు నిర్వహిస్తే చర్యలు

జిల్లాలో విచ్చలవిడిగాా తిరుగుతున్న బైక్‌లపై దృష్టి సారించాం. నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలు చేస్తే చర్యలు తప్పవు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో బైక్‌ రేసింగ్‌లు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నెంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు సీజ్‌ చేస్తాం.

– యు.రవిప్రకాష్‌, ఎస్పీ, భీమవరం

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement