పోక్సో ఈ–బాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

పోక్సో ఈ–బాక్స్‌

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

బాధితులకు భరోసా..
పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కకుండానే మొబైల్‌ యాప్‌ నుంచి ఫిర్యాదు

సాక్షి, వరంగల్‌: జిల్లాలో ఏటికేడు బాలికలపై లైంగిక దాడుల విషసంస్కృతి పెరిగిపోతోంది. తెలిసినవారు, బంధువులు, చుట్టుపక్కల వారు, స్నేహితుల ముసుగులో జరుగుతున్న ఆకృత్యాలపై కొంతమంది బాధితులు పరువు పోతుందని ముందుకు రాని ఘటనలు ఉన్నాయి. నమోదైన ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్స్‌ (పోక్సో) కేసులతో పోలిస్తే కానివి మూడింతలు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితుల వివరాలు గోప్యంగా..

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ కేసులో బాధిత బాలిక, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సమయం తీసుకోవడంపై పోలీసుల తీరుపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్‌ గడప తొక్కకుండానే మొబైల్‌ ద్వారా ‘పోక్సో ఈ–బాక్స్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఫిర్యాదు చేయడం ద్వారా ఎక్కడికి వెళ్లకుండానే న్యాయం దొరికే అవకాశముందని సామాజికవేత్తలు అంటున్నారు. కేంద్రం గతేడాది తీసుకొచ్చిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ పర్యవేక్షిస్తున్న ఈ యాప్‌ ద్వారా కేసు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. బాధితుల వివరాలు గోప్యంగా ఉండడంతో పాటు నిందితులకు శిక్షపడే వరకు ఈ యాప్‌ సేవలు అందిస్తుంది. ఈ యాప్‌లో వచ్చిన ప్రతీ ఫిర్యాదును ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తూ ఆ వివరాలను రాష్ట్ర, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు పంపిస్తాయి. కేసు విచారణలోనూ ఈ యాప్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. బాధిత బాలికలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తారు. అత్యాచార బాధిత బాలికలకు సులభతరమైన సేవలు అందించడమే పోక్సో ఈ – బాక్స్‌ ముఖ్య ఉద్దేశం. చాలామందికి అవగాహన లేక పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతూ, కొన్ని సందర్భాల్లో పరువు పోతుందని వెనుకాడుతున్న ఘటనలు సైతం ఉన్నాయి. ఇటీవల వరంగల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మట్టెవాడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫిర్యాదు ఎలా చేయాలంటే..

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పోక్సో ఈ–బాక్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఓపెన్‌ చేసి రెడ్‌ కలర్‌ పోక్సో పేరుతో ఉన్న ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అందులో ప్లే గ్రౌండ్‌, షాప్‌, రోడ్డు, స్కూల్‌, ట్యూషన్‌, బ్లాక్‌ మెయిల్‌, స్కూల్‌ బస్సు, స్కూల్‌ వ్యాన్‌, ఫ్యామిలీ మెంబర్‌, రిలేటివ్‌, ఇతరులు, ఇంటర్నెట్‌, ఫోను వంటి అంశాలు ఫొటోలతో కనిపిస్తాయి. ఘటనకు సంబంధించిన చిత్రంపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత పేరు, ఈ మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసిన తర్వాత సదరు ఘటన వివరాలను పొందుపర్చాలి. అంతే ఫిర్యాదు యాప్‌లో నమోదవుతుంది. ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో పాటు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి విచారణ పూర్తి చేస్తారు.

ఠాణాకు వెళ్లకుండానే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు

స్నేహాల విషయాల్లో బాలికలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు, స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సైతం నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. ఏదైనా జరగరాని ఘటన జరిగితే వివరాలను రహస్యంగా ఉంచాలనుకుంటే కేంద్రం తీసుకొచ్చిన ‘పోక్సో ఈ బాక్స్‌ యాప్‌’లో ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయి. బాధితులకు న్యాయం జరిగే అవకాశముంది.

– మండల పరశురాములు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా

పోక్సో

కేసులు

46

24

జిల్లాలో నమోదైన పోక్సో కేసు వివరాలు:

2024 2025 2026

కేంద్రం తీసుకొచ్చిన ఈ యాప్‌పై అవగాహన లేక వెనుకడుగు

పరువు పోతుందనే భయంతో ఠాణా మెట్లు ఎక్కని బాధితులు ఎందరో

జిల్లాలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతుండడంతో ఆందోళన

బండి భగీరథ కేసులో పోలీసుల వైఖరితో ఈ యాప్‌ వాడకంపై చర్చ

బాధితులకు ‘భరోసా’ ఉంది

చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే పోలీసులకు సరిగా చెప్పుకోలేరన్న ఉద్దేశంతో తొలుత భరోసా కేంద్రాల్లోని నిపుణులు బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. నేరం జరిగిన తీరును అధ్యయనం చేసి, వైద్య సదుపాయం అందివ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఇలా భరోసా కేంద్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లాలో ఈ ఏడాది 46 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులకు శిక్షపడే వరకు బాధితులుగా భరోసా కేంద్రాలు అండగా ఉంటాయి. అలాగే, 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, 181 మహిళా హెల్ప్‌లైన్‌, షీ టీమ్స్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్లకు కూడా ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement