సంగెం: ఉపాధిహామీ పనులకు ప్రతి గ్రామపంచాయతీ నుంచి అధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఆర్‌డీఓ నాగపద్మజ ఆదేశించారు. మండలంలోని కాపుల కనిపర్తి, గవిచర్ల, షాపూర్, ఎల్గూర్ రంగంపేట, మొండ్రాయి తదితర గ్రామాల్లోని పని ప్రదేశాలను ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి ప్రతి గ్రామపంచాయతీ నుంచి కనీసం 150 మందికి తగ్గకుండా కూలీలు హాజరయ్యేలా చూడాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస వసతులు కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, చెరువుల అభివృద్ధి, మట్టి పనులు, మొక్కల సంరక్షణ వంటి పనులు చేపట్టి కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కాసర్ల రవీందర్, ఏపీఓ గణేష్, ఆయా గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల ఐక్యతా రాగం
హన్మకొండ చౌరస్తా: ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారు. గతంలో కొండా సురేఖపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెరెడ్డి, బస్వరాజు సారయ్య అనేకసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అవన్నీ పక్కనపెట్టి తామంతా ఒక్కటే అంటూ ఐక్యతా రాగాన్ని ఆలపించారు. సోమవారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందరూ కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏర్పాటుచేసిన విందుకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్, ధన్వంతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీఈ గుర్తింపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్ ఎన్.రమణ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ ఆచార్య బి. వెంకట్రాంరెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.భిక్షాలు, స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య పాల్గొన్నారు.


