వరంగల్ క్రైం: ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో సోమవారం కమిషనరేట్ నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు తమ సమస్యలను పోలీస్ కమిషనర్‌కు స్వయంగా తెలియజేశారు. సమస్యలను విన్న పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి శాశ్వత పరిష్కారాలు చూపాలని, బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం సుమారు 10 ఫిర్యాదుల్ని సీపీ పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసుల పురోగతి, భూ సమస్యలు, తదితర విషయాలు ఉన్నట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా.. 87126 85257 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.
యంత్రాల ప్రారంభం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో పోలీస్ కార్ల మరమ్మతుల కోసం నూతనంగా నెలకొల్పిన భారీ హైడ్రాలిక్ యంత్రంతో పాటు, వాహన టైర్లను తొలగించి, అమర్చే యంత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌కుమార్, దార కవిత, అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, అంతయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, సత్యనారాయణ, జాన్ నర్సింహులు ఆర్‌ఐలు శ్రీధర్, స్పర్జన్‌రాజ్, సతీశ్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌తో ఇతర అధికారులు ఎంటీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్


