గీసుకొండ: కాలుతున్న చొప్ప మీద పడి సైకిలిస్టుకు గాయాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన బైకని ఎర్రయ్య గీసుకొండకు సైకిల్‌పై వెళ్తుండగా ఉదయం 11.30 గంటలకు గీసుకొండకు చెందిన రైతు చాపర్తి వెంకటేశ్వర్లు రోడ్డు సమీపంలోని తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న చొప్పకు పెట్టిన నిప్పుతో ఎగసిన మంటలు పడి గాయాల పాలయ్యాడు. ఎరయ్య్ర ముఖం, మెడ, చేతులకు మంటలు అంటుకున్నాయి. అతడిని బంధువులు తొలుత వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎర్రయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


