● ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త వెంకట్‌రెడ్డి
నెక్కొండ : పచ్చిరొట్ట సాగుతో భూమి సారవంతం అవుతుందని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. మండలంలోని అలంకానిపేటలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలకరి వర్షాలకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు భూమిలో చల్లాలని సూచించారు. వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన విత్తనాలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. మోతాదుకు మించి యూరియా వినియోగించొద్దని తెలిపారు. సమావేశంలో ఏఓ నాగరాజు, ఏఈఓ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.
యూరియా వాడకాన్ని తగ్గించాలి
నల్లబెల్లి : రైతులు పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న సూచించారు. మండలంలోని మేడపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు ఆధునిక, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. అవసరం మేరకే రసాయనాలను వినియోగించి భూసారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ఏఓ బన్న రజిత మాట్లాడుతూ పంటల మార్పిడి విధానాన్ని అవలంభించాలని చెప్పారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సదస్సులో మేడపల్లి సర్పంచ్ ఎర్రం సమ్మయ్య, ఏఈఓ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
మేలైన యాజమాన్య పద్ధతులతో లబ్ధి
గీసుకొండ : పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో పెట్టుబడి తగ్గి లబ్ధి చేకూరుతుందని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.శ్రవణ్‌కుమార్ తెలిపారు. మండలంలోని గొర్రెకుంటలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరిమితికి మించి రసాయన ఎరువులు, యూరియా వాడితే కలిగే అనర్థాలను వివరించారు. భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచేలా పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వాడాలని చెప్పారు. బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వై.హరి మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న, రైతులకు మద్దతు ధర లభించే విభిన్న రకాల వరి వంగడాల గురించి అవగాహన కల్పించారు. జాతీయ ఆహార భద్రత పథకం జిల్లా కన్సల్టెంట్ సారంగం మాట్లాడారు. అధిక సాంద్రత పత్తి సాగు విధానాలు, వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజీవుల పాత్ర, తదితరాలపై వివరించారు. కార్యక్రమంలో ఏఓ హరిప్రసాద్ బాబు, మొగిలిచర్ల పీఏసీఎస్ వైస్‌చైర్మన్ కందుల శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఓ గీత, తదితరులు పాల్గొన్నారు.
అవసరం మేరకే రసాయనాలు వాడాలి
పర్వతగిరి : రైతులు అవసరం మేరకే రసాయనాలను వినియోగించాలని శాస్త్రవేత్తలు డాక్టర్ వి.వెంకన్న, డాక్టర్ జె.భార్గవి కోరారు. మండలంలోని రావూరులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు వివరించారు. యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన విత్తనాలను వేసుకుంటే పురుగు తెగుళ్లు ఆశించడం తక్కువగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ టి.ప్రశాంత్, సర్పంచ్ భద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.
రైతులు అవగాహన పెంచుకోవాలి
రాయపర్తి : రైతులు పంటల సాగులో వస్తున్న నూతన అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశాంత్, మానస కోరారు. మండలంలోని కొండూరులో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. యూరియా, రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాయిని యాకన్న, ఏఈఓ కావ్య తదితరులు పాల్గొన్నారు.


