ఆర్థిక అభివృద్ధికి ఐక్యతతో అడుగులు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక అభివృద్ధికి ఐక్యతతో అడుగులు

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

ఆర్థిక అభివృద్ధికి ఐక్యతతో అడుగులు

ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు

క్రమం తప్పకుండా చెల్లింపు

పొదుపుతో రాణిస్తున్న మహిళా సంఘం

దుగ్గొండి : ముందు వారంతా వంటింటికే పరిమితం. అనంతరం కుటుంబ పోషణలో భాగస్వాములయ్యారు. ఆర్థిక బలోపేతం దిశగా ఐక్యత చాటారు. పొదుపు మంత్రం జపిస్తూ బ్యాంక్‌ల సాయం ఆశించకుండా సొంతంగా కోట్ల రూపాయలతో సభ్యులకు లక్షల రూపాయలు అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగారు. వీరికి ప్రభుత్వ అండ లేదు. పురుషుల తోడ్పాటు లేదు. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. మండలంలోని తొగర్రాయిలో 1993లో 70 మంది మహిళలతో నెలకు రూ.20 పొదుపుతో ఏర్పడిన ఝాన్సీ మహిళా పొదుపు సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం రూ.50 పొదుపు, 669 మంది సభ్యులతో రూ.2.14 కోట్ల నిల్వ సాధించింది. సభ్యుల అవసరాలకు కేవలం 0.75 పైసలు (సాలీనా 9 శాతం) వడ్డీపై గరిష్టంగా రూ.1.50 లక్షల అప్పు ఎలాంటి తాకట్టు లేకుండా ఇస్తున్నారు. వ్యవసాయం, కుటీర పరిశ్రమల స్థాపన, చిరువ్యాపారాల నిర్వహణ, పిల్లల చదువులు, పెళ్లి, తదితరాలకు అప్పులను వినియోగించుకుంటూ ఐక్యత చాటుతున్నారు.

మృతుల కుటుంబాలకు సాయం

సభ్యులు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి బీమా రూ.50 వేలు, అభయనిధి విపత్‌ పథకం కింద రూ.10 వేలు కలిపి నామినీకి రూ. 60 వేలు అందిస్తున్నారు. వీటితోపాటు సభ్యురాలి వాటాదనం కలిపి 15 రోజుల్లో బాధిత కుటుంబానికి అందజేస్తున్నారు.

నేడు 33వ వార్షికోత్సవం

ఝాన్సీ పొదుపు సంఘం నేడు (మంగళవారం) 33వ వార్షికోత్సవం నిర్వహించనుంది. సభ్యులు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్పూర్తితో ఐక్యతను పెట్టుబడిగా పెట్టి పొదుపు మంత్రాన్ని పఠిస్తూ స్వయంకృషితో ముందుకు సాగుతున్నారు.

సంఘం సభ్యుల కుటుంబాల ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తోంది. ప్రతినెలా రుణం అవసరమున్న సభ్యులు దరఖాస్తు చేసుకుంటే పాలకవర్గ సభ్యులు పరిశీలించి మంజూరు చేస్తారు. ప్రతినెలా వడ్డీతోపాటు కొంత అసలు చెల్లించాలి. అప్పు కిస్తీ, పొదుపు చెల్లింపులపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. నెలలో ఒకరిద్దరు కట్టకపోతే పాలకవర్గం వసూలు బాధ్యత తీసుకుంది. ఐక్యతతో బకాయి కట్టిస్తారు.

– కొనకటి శ్రీదేవి, పర్యవేక్షకురాలు

అప్పు తీసుకున్న సభ్యులు ప్రతినెలా వడ్డీతోపాటు అప్పు కిస్తీ, నెలవారి పొదుపు చెల్లిస్తారు. ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు చెల్లింపులు ఉంటాయి. రోజు వరుస క్రమంలో 60 మంది చెల్లిస్తారు. ఇప్పటివరకు ఒక్క సభ్యురాలు కూడా అప్పు చెల్లించలేని పరిస్థితి లేదు.

– ఆవుల నవ్య, అకౌంటెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement