ఘనంగా హిందూ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా హిందూ సమ్మేళనం

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

రాయపర్తి : మండలంలోని కిష్టాపురంలో సోమవారం హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి గొప్పతనం, యువత సమాజ సేవపై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తిగీతాలు, ధార్మిక ప్రసంగాలు, ప్రేరణాత్మక సందేశాలు ఆకట్టుకున్నాయి. ఏకశిల స్కూల్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా రామకృష్ణమాచార్యులు, ఓదెల చంద్రమౌళి, డాక్టర్‌ రవీందర్‌నాయక్‌, రాణాశంకర్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొండం రంగారెడ్డి, ఉపసర్పంచ్‌ తోట సోమనర్సయ్య, గట్టు నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

దుగ్గొండి : మండలంలోని తొగర్రాయికి చెందిన ఆవుల రమేశ్‌ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి మురిగివాలా చికెన్‌ సెంటర్‌ యజమాని డ్యాగం ప్రతాప్‌, డ్యాగం శివాజి, తొగర్రాయి, బిక్కాజిపల్లి, గుడిమహేశ్వరం గ్రామాల సర్పంచ్‌లు రాస రమ చేరాలు, బండారి రమేశ్‌, కూరతోట స్వప్న సురేష్‌ సోమవారం రూ.10 వేల సాయం అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు ఆవుల నర్సింహారెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ, నాయకులు బండారి ప్రకాశ్‌, అల్లాపురం ప్రదీప్‌, కొనకటి రమేశ్‌, శ్రీనివాస్‌, నర్సింహస్వామి, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

‘ఎస్‌ఆర్‌ఆర్‌’ చేయూత

రాయపర్తి : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన చిర్ర సాయిలు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి ఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ సోమవారం చేయూత అందించింది. ఫౌండేషన్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి సమకూర్చిన బియ్యం, సరుకులను బాధిత కుటుంబానికి ఫౌండేషన్‌ ప్రతినిధి లేతాకుల రంగారెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. తొలుత సాయిలు చిత్రపటానికి రంగారెడ్డి, తదితరులు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్‌ తాటికాయల కేతమ్మ, బీఆర్‌ఎస్‌ నాయకులు యాదవరెడ్డి, యాకయ్య, ఐత కొమురయ్య, లింగాల శ్రీనివాస్‌, సుధీర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తో జీపీలో సామగ్రి దగ్ధం

ఖానాపురం : మండలంలోని బండమీదిమామిడితండాలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్‌తో సోమవారం సామగ్రి దగ్ధమైంది. సర్పంచ్‌ రమేశ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. సుమారు రూ.45 వేల విలువైన ఫర్నీచర్‌, కుర్చీలు, ఫ్యాన్‌లతోపాటు సామగ్రి దగ్ధమైనట్టు తెలిపారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్‌ చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement