పర్వతగిరి : దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఐ రాజగోపాల్ సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బోగం ప్రవీణ్‌తో కలిసి విలేకరులతో సీఐ మాట్లాడారు. మహిళలు బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆరు బయట పడుకుంటే ఇంటికి తాళం వేయాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై డయల్ 100కు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సర్వేకు సహకరించండి
ఖానాపురం : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వేకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ నంగునూరి రమేశ్ కోరారు. మండలంలోని చిలుకమ్మనగర్, అశోక్‌నగర్, తదితర గ్రామాల్లో చేపట్టిన సర్వేను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎన్యుమరేటర్లకు సరైన సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. తద్వారా ప్రభుత్వం వద్ద స్పష్టమైన వివరాలు ఉంటాయని తెలిపారు. వివరాల నమోదులో ఎన్యుమరేటర్లు సమర్ధత చాటాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ సుగుణ, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
గుడుంబా స్వాధీనం
గీసుకొండ : మండల పరిధిలోని జాన్‌పాకలో బాదావత్ విజయ్‌కుమార్‌ను 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసినట్టు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. విజయ్‌కుమార్ గుడుంబా విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
రేపు వేలం
వర్ధన్నపేట : స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను రేపు (బుధవారం) ఉదయం 10 గంటలకు వేలం వేస్తామని ఆ శాఖ ఎస్‌హెచ్‌ఓ, సీఐ స్వరూప సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లో 50 శాతం ముందస్తుగా చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. వివరాల కోసం స్థానిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
నేడు ఇంటర్వ్యూ
దుగ్గొండి : మండల పరిషత్ కార్యాలయంలో నేడు (మంగళవారం) ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఎంపీడీఓ అరుంధతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్ నుంచి రుణాల మంజూరీకి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని కోరారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 45 మంది వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.
లారీ డ్రైవర్‌పై దాడి
వర్ధన్నపేట: లారీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన మండల కేంద్రంలోని వరంగల్–ఖమ్మం రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. ఖమ్మం నుంచి వరంగల్ దిశగా వెళ్తున్న సిమెంట్ లారీ పట్టణంలో యూ టర్న్ తీసుకుంటుండగా అక్కడికి వచ్చిన కేసముద్రం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ మద్యం మత్తులో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై లారీ ఎందుకు ఆపావంటూ లారీ డ్రైవర్‌పై దాడి చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


